ప్రియాంక మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రియాంక మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

అల్లవరం: రాజమహేంద్రవరంలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌లో తీవ్రంగా గాయపడి హైదారాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఎంపీ చింతా అనురాధ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మృతికి విచారం వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆమె కోరారు. మద్యం మత్తులో బాధ్యతా రహితంగా వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొన్న ఘటన అత్యంత బాధాకరమని ఆమె తెలిపారు. ప్రియాంక మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అనురాధ డిమాండ్‌ చేశారు.

సత్యగిరిపై నేటి నుంచి సర్వే

అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి చెందిన సత్యగిరిపై పోడు వ్యవసాయం పేరుతో ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నాలను దేవస్థానం అధికారులు భగ్నం చేసిన నేపథ్యంలో మొత్తం కొండ అంతా సర్వే చేసి సరిహద్దు రాళ్లు పాతేందుకు రంగం సిద్ధమైంది. సర్వే విభాగానికి చెందిన పది మంది సోమవారం ఉదయం నుంచి సర్వే పనులు ప్రారంభిస్తారు. 1998లో దేవస్థానం రెవెన్యూ శాఖ నుంచి కొనుగోలు చేసిన 308 ఎకరాల సత్యగిరిని సర్వే చేయనున్నారు. సర్వే పూర్తి చేసిన వెంటనే సరిహద్దు రాళ్లు పాతుతారు. తరువాత పది అడుగులకొక స్తంభాన్ని పాతి సిమెంట్‌ కాంక్రీట్‌ వేయాలని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదేశించారు. గిరిప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న సత్యగిరిపై పోడు వ్యవసాయం చేసేందుకు ప్రయత్నాలు చేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల మూడో తేదీన ‘పోడు’పొచ్చాలు శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి దేవస్థానం అధికారులు స్పందించి ఆ పోడు వ్యవసాయానికి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు.

బ్లాక్‌ మెయిలింగ్‌లు పెరిగాయి

కాకినాడ క్రైం: క్షణకాలంలో మారిపోయే రోగి ఆరోగ్య పరిస్థితి పలుమార్లు చావు బతుకులను నిర్ణయిస్తాయని, ఈ ఘటనల్లో వైద్యులను బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తూ దాడులు పాల్పడడం దారుణమని కాకినాడ అబ్‌స్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజికల్‌ సొసైటీ (కాగ్స్‌) అధ్యక్షురాలు డాక్టర్‌ ఏఎల్‌ సత్యవతి అన్నారు. ఆదివారం స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కాగ్స్‌ ఆధ్వర్యంలో ‘అభయ’ దినోత్సవ చర్చా వేదిక జరిగింది. కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా రాష్ట్ర డీఎంఈ డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్థన్‌, కాకినాడ మూడో జిల్లా జడ్జి జి.ఆనంది, అదనపు ఎస్పీ మహంతి కిషోర్‌కుమార్‌ హాజరయ్యారు. కోల్‌కతాలో ఆర్‌జీ కార్‌ అమానవీయ ఘటన జరిగి సరిగ్గా రెండేళ్లు కావడంతో ‘అభయ’ సదస్సు నిర్వహించారు. డాక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ సమస్య వచ్చినప్పుడు రోగుల బంధువుల ముసుగులో వచ్చే గుంపులు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. సోషల్‌ మీడియా, ఆర్‌టీఐ చట్టం పేరుతో చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌ అంతా ఇంతా కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బందికి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఏపీ మెడికేర్‌ యాక్ట్‌ను అమలు చేసి వైద్యులు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని ఐఎంఏ నాయకుడు డాక్టర్‌ కిరణ్‌ చిట్ల అన్నారు. రాష్ట్ర డీఎంఈ డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్థన్‌ మాట్లాడుతూ వైద్యుల భద్రతకు కలెక్టర్‌, పోలీస్‌ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న హౌస్‌ సర్జన్లు, పీజీలకు భద్రతే కాదు.. కనీసం బాత్రూమ్‌లు లేవని జూడా నాయకుడు హరికృష్ణ అన్నారు. క్యాజువాలిటీలో విధులు నిర్వర్తిస్తుంటే, రాత్రి వేళల్లో తాగుబోతులు ప్రవేశించి వైద్యులు, వైద్యేతర సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుందర్‌ అన్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనల నివారణకు సెక్యూరిటీతో పాటు తగిన పోలీస్‌ భద్రత అవసరమని నర్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మి కోరారు. వైద్యులపై జరుగుతున్న దాష్టికాలను జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. కాగ్స్‌ తమకు నివేదించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా జడ్జి ఆనంది మాట్లాడుతూ విఽధి నిర్వహణలో ఉండే వైద్యులకు సహకరిస్తే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. పీఓఎస్‌హెచ్‌ చట్టం కట్టుదిట్టంగా అమలు చేసి పని ప్రదేశాల్లో సమస్యలను నివారించాలని సూచించారు. అదనపు ఎస్పీ మహంతి కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ, సమస్యలు ఉంటే పోలీసుల వరకు ఎందుకన్న ధోరణిని విడనాడి తక్షణమే ఫిర్యాదు చేస్తే సత్ఫలితాలుంటాయన్నారు. అంతకుముందు, అభయ డే సందర్భంగా డాక్టర్‌ సత్యవతి ఆధ్వర్యంలో వాక్‌థాన్‌ నిర్వహించారు. సదస్సుకు సమన్వయకర్తగా ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఫణికిరణ్‌ వ్యవహరించగా, కాగ్స్‌ సెక్రటరీ ఎ.మాధవి సదస్సు నిర్వహణ కార్యకలాపాలు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement