అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మహా నివేదన చేశారు. స్వామికి రెండు జంటలు పంచామృతాభిషేకం, గరిక పూజ చేశారు. 28 మంది భక్త దంపతులు లఘున్యాస అభిషేకాలు జరిపారు. 16 మంది భక్త దంపతులు శ్రీలక్ష్మీగణపతి హోమం జరిపారు. నలుగురు చిన్నారులకు అన్నప్రాశన చేశారు. 10 మందికి తులాభారం సమర్పించారు. 74 మంది భక్తులు తమ నూతన వాహనాలకు పూజలు చేయించుకున్నారు. 2280 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. స్వామికి ఆదివారం ఒక్క రోజు రూ.3,64,591 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


