పచ్చని సీమకు..! | - | Sakshi
Sakshi News home page

పచ్చని సీమకు..!

Jul 26 2026 12:09 AM | Updated on Jul 26 2026 12:09 AM

రెక్కలు కట్టుకుని

వైనతేయ దీవుల్లో

సైబీరియన్‌ పక్షుల స్థిర నివాసం

ఐదేళ్లలో లక్షలకు చేరిన పక్షులు

అటవీ శాఖకు సైతం చిక్కని ప్రదేశం

మలికిపురం: ఆసియాలోనే అతి పెద్ద పక్షుల సంరక్షణ కేంద్రం కొల్లేరు కొంప మునిగినట్టేనా.. వేసవి విడిదికి అక్కడికి వచ్చే విదేశీ జాతి పక్షులు మరో దారి వెతుక్కున్నాయా.. అంటే అవుననక తప్పదు. ఆక్వా చెరువులు, పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న కొల్లేరులో ఉండలేక సైబీరియన్‌ జాతి పక్షులు కోనసీమ జిల్లా వైనతేయ నదీ ద్వీపాలను ఆవాసయోగ్య ప్రాంతాలుగా ఎంచుకున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ లెక్కల్లో లేని పక్షుల అడవి ఇది. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని పక్షుల ఆవాస ప్రాంతం ఇది. బయటి ప్రపంచంతో పోలిస్తే ఇక్కడ ఇన్ని పక్షులు ఉన్నాయనే విషయం నిత్యం చేపల వేట సాగించే మత్స్యకారులకు కూడా తెలియదు. అదే వైనతేయ నదీ తీరంలోని గోగన్నమఠం, కరవాక మధ్య వైనతేయ లంకలు. ఇక్కడ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఐదేళ్ల క్రితం వరకు ఇక్కడ మడ అడవులను సైతం ఆక్రమించి రొయ్యల చెరువుల సాగు జరిగింది. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ చెరువుల సాగు నిలిచిపోయి మడ అడవులు మళ్లీ విస్తారమై యథాతథ స్థితికి రావడంతో విదేశీ పక్షులకు ఆవాసయోగ్యంగా మారింది.

వలస పక్షుల శాశ్వత నివాసం

ప్రస్తుతం వైనతేయ లంకలు సైబీరియా వలస పక్షుల శాశ్వత నివాసంగా మారాయి. స్థానికంగా పెద్ద బాతు అని పిలిచే ఈ పక్షులు ఇక్కడ లక్షల్లో ఉన్నాయి. ఈ పక్షి శాసీ్త్రయ నామం గద్వాల్‌ మారెకా స్ట్రేపెరా. ఐదేళ్ల క్రితం అరకొరగా కనిపించే ఈ పక్షులు నేడు లక్షల్లో కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యమే. కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్ర అధికారుల సమాచారం ప్రకారం ఈ పెద్ద బాతు కొల్లేరులో లేదు. జూలై నెల ప్రాంతాల్లో వచ్చే వర్షాల సమయంలో చల్లని వాతావరణం కోసం ఈ పక్షులు సైబీరియా నుంచి ఇక్కడకు వస్తాయి. తిరిగి ఫిబ్రవరిలో ఎండల ధాటికి తట్టుకోలేక మళ్లీ సైబీరియా వెళ్లిపోతాయి. అయితే ఐదేళ్లుగా అవి ఇక్కడే ఉండిపోవడం గమనార్హం.

సాధారణ బాతుల కంటే భిన్నంగా..

ఈ పెద్ద బాతులు స్థానికంగా పెంచుకునే బాతుల కన్నా భిన్నంగా ఉంటాయి. పోలిక సుమారు ఒకేలా ఉన్నా జీవన శైలి మాత్రం పూర్తి విభిన్నం. సాధారణ బాతు నీళ్లలో నెమ్మదిగా ఈదుతుంది. ఆపద వస్తే ఎగరలేదు. ఈ సైబీరియన్‌ బాతు మాత్రం నీటిలో ఎక్కువసేపు మునిగి ఉండగలదు.. వేగంగా ఈదగలదు.. ఆహారం కోసం వేటాడగలదు. అంతే కాదు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. ఈ పక్షులు నాలుగు నుంచి రెండు వందలకు పైగా కలిసి గుంపులుగా వెళ్తుంటాయి. ఒక నెలలో పది వరకూ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఓ మాదిరిగా ఎగిరే వయసు వచ్చిన పిల్లలను దగ్గరలో వేటకు తీసుకువెళ్లడం, ఆపదలో సైతం వాటిని వదలకుండా అత్యంత వేగంగా కదులుతూ రక్షించుకుంటుంది.

గోదారి నీరు పడినట్టుంది!

గోదావరి జిల్లాల నుంచి అనేక మంది కవులు, నటులు తమ యాస, భాష, వ్యంగ్యంతో రాణించారు. కాస్త బాగున్నాడు అంటే గోదారి నీళ్లు పడ్డాయిరా వీడికి అని పూర్వీకులు అంటారు. అలా ఈ సైబీరియన్‌ పక్షులకు సైతం ఈ గోదావరి నీళ్లు పడినట్టున్నాయి. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి.

ఆహారం కోసం నిత్యం వంద కిలోమీటర్ల పయనం

నిత్యం ఉదయం ఐదు గంటలకు ఇక్కడి పక్షులన్నీ ఒకేసారి గాల్లోకి లేచి సుమారు వంద కిలోమీటర్లు పైబడి పయనించి గోదావరి చప్పనీరున్న చోట మాత్రమే వాలి చేపలు, ఇతర జీవులను తీసుకుని మళ్లీ సాయంత్రానికి ఇక్కడి గూళ్లకు చేరుకుంటాయి. వాటిని చూడాలన్నా.. వాటి కిలకిలరవాలను విని ఆస్వాదించాలన్నా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బోట్లలో ఆయా లంకల వద్దకు వెళ్లాల్సిందే. వైనతేయ నది బంగాళాఖాతంలో కలిసే ముందు శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌ సంగమ ప్రాంతంలో ఈ లంకలు ఉన్నాయి.

ఐదేళ్లలో లక్షలకు చేరాయి

గత ఐదేళ్లలో ఈ పక్షులు లక్షలకు పైబడి చేరాయి. నదిలో దీవుల మధ్య మడ అడవుల్లో వీటి శాశ్వత నివాసాలు ఉన్నాయి. ఉదయమే మేము బోట్లపై చేపల వేటకు వెళ్లేటప్పుడు ఇవన్నీ ఒకేసారి లేచి వేటకు వెళ్లి మళ్లీ సాయంత్రానికి గూటికి చేరుకుంటాయి. ఈ పక్షులను అటవీ శాఖ గుర్తించి సంరక్షించాలి.

– అర్ధాని శ్రీను, గోగన్నమఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement