మరమ్మతులకు ‘గుడిమెళ్లంక’ మోటార్లు | - | Sakshi
Sakshi News home page

మరమ్మతులకు ‘గుడిమెళ్లంక’ మోటార్లు

Jul 26 2026 12:09 AM | Updated on Jul 26 2026 12:09 AM

మలికిపురం: గుడిమెళ్లంక సమగ్ర మంచినీటి సరఫరా పథకం పనులను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ శనివారం పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన సాక్షిలో ‘కష్టాల కన్నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ పథకంలో పాడైన మోటార్లను గుజరాత్‌కు మరమ్మతుల నిమిత్తం పంపారు. గత 15 రోజులుగా ఇక్కడి 38 గ్రామాలకు తాగునీరు అందని విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్‌ నివారం ఎస్పీ రాహుల్‌ మీనాతో కలసి పథకం పనులను పరిశీలించి, తాగునీటి సరఫరా వ్యవస్థ పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గుడిమెళ్లంక సీపీడబ్ల్యూ పథకం ద్వారా 4 మండలాలకు సంబంధించి 29 గ్రామ పంచాయతీల పరిధిలోని 97 ఆవాసాలకు, వాటిలోని సుమారు 1,18,983 మంది ప్రజలకు తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద ఏర్పాటు చేసిన 50 హెచ్‌పీ మోటార్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, అయితే 70 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు మోటార్లు కాలిపోవడంతో ముడి నీటిని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు పంపించడంలో అంతరాయం ఏర్పడిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటికే ఒక మోటారును రీవైండింగ్‌ చేసి తిరిగి అమర్చగా, మరో మోటారును ఈ నెల 27వ తేదీలోగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే, గుడిమెళ్లంకలో నిర్మాణంలో ఉన్న 6.00 ఎంఎల్‌డీ ర్యాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్‌ పనులను కలెక్టర్‌ పరిశీలించి, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా మాట్లాడుతూ జిల్లాలోని ఎల్‌–నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదైందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ఏవీఎస్‌ రాజన్‌, సంబంధిత ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తాగునీటి ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement