5న దేవరపల్లికి వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

5న దేవరపల్లికి వైఎస్‌ జగన్‌

Jul 26 2026 12:09 AM | Updated on Jul 26 2026 12:09 AM

దేవరపల్లి: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగస్టు 5న తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటిస్తారని మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత శనివారం తెలిపారు. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి, వేలం ప్రక్రియను పరిశీలిస్తారని వెల్లడించారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.

యువత సమస్యలపై

28న వైఎస్సార్‌ సీపీ నిరసన

రామచంద్రపురం రూరల్‌: ఈ నెల 28న వైఎస్సార్‌ సీపీ యువజన–విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న నిరసన ర్యాలీ పోస్టర్‌ను మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్‌ ఆవిష్కరించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఈ మేరకు సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ దేశంలో నీట్‌ ప్రశ్నా పత్రాల అక్రమాలు, రాష్ట్రంలో ఫీజు రీయింబర్సుమెంటు, నిరుద్యోగ భృతి, వసతి దీవెన బకాయిలు, విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అమలాపురం నల్లవంతెన వద్ద వంటెద్దు వెంకయ్యనాయుడు కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్డిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లాలోని 7 నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఇన్‌చార్జి నియామకంలో జాప్యం ఎందుకు?

అధిష్టానం తీరుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

పి.గన్నవరం: నియోజకవర్గ టీడీపీకి ఇన్‌చార్జిని నియమించకపోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈనెల 27 నుంచి చేట్టాల్సిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సన్నాహక సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో జరుగుతుండగా కొందరు కార్యకర్తలు లేచి ఇన్‌చార్జిని నియమించకుండా ఎన్నాళ్లు జాప్యం చేస్తారని నాయకులను నిలదీశారు. ఇన్‌చార్జి లేకుండా తాము కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావాలని వారు ప్రశ్నించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తుల సాయి, గంధం పల్లంరాజు శ్రేణులను వారించి సమస్యను అధిష్టానానికి వివరిస్తామని సముదాయించారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో

కరప: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరప గ్రామంలోని అగ్నికుల క్షత్రియుల వీధికి చెందిన వాడ్రేవు నూకరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని శనివారం కాకినాడ వెళ్లి తిరిగి వస్తున్నాడు. కరప పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చే సరికి రామచంద్రపురం వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో ముందుభాగం నుజ్జవ్వగా, డ్రైవర్‌ సీటులో నూకరాజు ఇరుక్కుపోయాడు. స్థానికులు స్పందించి రక్త గాయాలతో ఉన్న నూకరాజును ఆటో నుంచి బయటకు తీసి, 108లో చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement