● సాంకేతిక సమస్యలతో నిధి పోర్టల్‌లో నమోదు కాని సిబ్బంది వివరాలు
● వేతనాలందక ఆందోళన చెందుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
● ఈ నెలా సరిదిద్దకపోతే
వచ్చేనెల జీతాలకూ ఎసరు
ఆలమూరు: ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వం, ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం.., వాస్తవంలో చీకటిని చూపిస్తున్న ప్రభుత్వం, సమాన పనికి సమానం వేతనం.. తమ క్రమబద్ధీకరణ ఎప్పుడు అంటూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే వేతనాలు అందజేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం వాస్తవ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు నిలిచిపోయాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ తారతమ్యం లేకుండా సీఎఫ్‌ఎంఎస్ ద్వారా వేతనాలు మంజూరయ్యేవి. కాగా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ ఉద్యోగులను మినహాయించి మిగతా ఉద్యోగులకు కొత్తగా ఏర్పాటు చేసిన నిధి పోర్టల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఆ పోర్టల్‌లో సాంకేతిక లోపంతో ఉద్యోగుల వివరాలు అనుసంధానం కాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 25 వేల మందికి వేతనాలు నిలిచిపోయాయి. ఈ నెల ఆరు నుంచి పది వరకూ రెండోసారి బిల్లులు అప్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉన్నా పోర్టల్‌లో లోపంతో ఆ సమయం కూడా ముగిసిపోయింది. అయితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తేనే కాని మార్చి నెలకు సంబంధించిన జీతాలు ఏప్రియల్‌లో పడే అవకాశం లేదు.
కనిపించని క్యాడర్ వివరాలు
నిధి పోర్టల్‌లో ఇప్పటి వరకూ ఉద్యోగుల వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్లే ఆయా శాఖల్లోని యూడీసీలు, అక్కౌంట్స్ అధికారులు బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నా పోర్టల్ తీసుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మార్చినెల జీతాలు సైతం ఏప్రిల్‌లో పడకపోవచ్చునని, సకాలంలో వేతనాలు అందక అందిన చోటల్లా అప్పులు చేసి కుటుంబాలను, ఆర్థిక వ్యవహారాలను నెట్టుకొస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఫిబ్రవరి వేతనాలు అందించాలి. నిధి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను సత్వరం సరిదిద్ది వినియోగంలోకి తీసుకురావాలి.
– గుత్తుల వీరబ్రహ్మం, రాష్ట్ర బీసీ
ఉద్యోగుల సంఘ అధ్యక్షులు
సాంకేతిక సమస్యల పరిష్కారం
నిధి పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందజేస్తాం. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే అందరికీ వేతనాలు అందించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– బి.రామభద్రం, డీటీఓ ఇన్ ట్రెజరీస్,
ముమ్మిడివరం


