సాక్షి, అమలాపురం: ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేయడంతోపాటు.. ఇచ్చిన హామీకి ఇంకా మెరుగైన ప్రయోజనం చేకూరుస్తూ మేలు చేసింది’ జగన్ ప్రభుత్వం. అదే రైతు భరోసా. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొలి ఏడాది తుంగలో తొక్కి.. రెండో ఏడాదిలో అమలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నా లబ్ధిదారులకు కోత పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం.’ ఇదే అన్నదాతా సుఖీభవ.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో మూడో విడత, 22వ విడత పీఎం కిసాన్ నిధులు శుక్రవారం జిల్లాలో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం మొదలు పెట్టింది ప్రభుత్వం. ఈ పథకం మూడో విడత జనవరిలో 1,34,829 రైతు కుటుంబాలకు రూ.4 వేలు చొప్పున రూ 53.93 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు చొప్పున జిల్లా వ్యాప్తంగా 1,15,400 రైతు కుటుంబాలకు రూ.23.08 కోట్ల మేర నిధులు జమ చేయనున్నారు. మొత్తం ఈ రెండు పథకాలకు సంబంధించి రూ.77.01 కోట్లు జమ చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.
లబ్ధిదారులకు కోత
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసాతో పోల్చుకుంటే అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏడాదికి సగటున 1,45,890 మందికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవలో 1,34,829 మందికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సుమారు 11,061 మందికి కోత పడినట్టు అంచనా. అదే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో లబ్ధిపొందేది 1,15,400 రైతులు మాత్రమే. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ఏకంగా 30,490 మందికి పీఎం కిసాన్ సొమ్ములు రానట్టే లెక్క. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు దఫాలుగా రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.
అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిదారుల సంఖ్య తగ్గడం వల్ల జిల్లాలో 11,061 మంది రైతులు రూ.22.12 కోట్లను నష్టపోయారు. గత ఏడాది అసలు పథకమే అమలు చేయకపోవడం వల్ల రైతులు రూ.291.78 కోట్లను కోల్పోయారు. మొత్తం మీద అన్నదాత సుఖీభవ పేరు చెప్పి ప్రభుత్వం తమకు రూ. 313.9 కోట్లు బకాయి ఉన్నట్టు చెబుతున్నారు.
కౌలుదారుల నోట మన్ను..
గత ప్రభుత్వం కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేశారు. దీర్ఘకాలికంగా సాగు చేసిన వారితో పాటు, దేవస్థానం భూములు ఎక్కువ సంవత్సరాలు సాగు చేసిన వారికి సైతం రైతు భరోసా అందించారు. ీకౌలు గుర్తింపు కార్డులు ఉండి రైతు అనుమతి ఉన్న కౌలుదారులకు సైతం భరోసా సొమ్ములు అందాయి. కాని చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల నుంచి కౌలుదారులను తప్పించేశారు. నిజమైన సాగుదారులకు జరుగుతున్న అన్యాయంపై వారు మండిపడుతున్నారు. జిల్లాలో 1.63 లక్షల వరకు వరి ఆయకట్టు ఉంటే సుమారు 80 శాతం భూములను కౌలుదారులు సాగు చేస్తుండడం గమనార్హం.
ఇచ్చిన హామీ కన్నా పెంచి..
వైఎస్సార్ రైతు భరోసా ఏడాదికి సగటున 1,45,890 మందికి రూ.13,500 చొప్పున ఐదేళ్లకు ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.67,500 అందించారు. మొత్తం ఐదేళ్లకు కలిపి రూ.984.75 కోట్లు అందించారు. 2019 ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలలో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సీఎం అయిన తరువాత తొలి ఏడాది నుంచి ఐదేళ్ల పాటు ఎన్నికల ముందు ఇస్తానన్న రూ.12,500కు అదనంగా మరో రూ.వెయ్యి చొప్పున కలిపి రూ.13,500 అందించారు. అది కూడా నాలుగేళ్లు అన్న ఎన్నికల హామీని ఐదేళ్లకు పెంచి రైతులకు లబ్ధి చేకూరేలా చేశారు. కాని చంద్రబాబు మాత్రం ఎన్నికల ముందు ఏటా క్రమం తప్పకుండా రైతులకు రూ.20 వేల చొప్పున ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చి తొలి ఏడాది విజయవతంగా ఎగొట్టారు. రెండో ఏడాది ప్రోత్సాహం ఇచ్చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నా లబ్ధిదారులలో కోత పెట్టారు.
సాగుకు భరోసా ఇవ్వని సర్కారు
సుఖీభవ పేరుతో శుష్క వాగ్దానాలు
1,34,829 మందికి మాత్రమే జమ
కూటమి కట్టి 11,061 మందికి మొండిచెయ్యి
జగన్ ప్రభుత్వంలో
1.45 లక్షల మందికి లబ్ధి
కౌలుదారులకు అడుగడుగునా దగా
ఒక్క రూపాయి కూడా రాలేదు
నేను ఆరు ఎకరాల్లో కౌలుకు వరి సాగు చేస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా నాకు అన్నదాత సుఖీభవ అందలేదు. గత ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.13,500 చొప్పున నా అకౌంట్‌లో సొమ్ములు పడ్డాయి. చిన్నచిన్న పెట్టుబడులకు సొమ్ములు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సొమ్ములు రాకపోవడంతో చిన్నచిన్న పెట్టుబడులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది.
– ధోనిపాటి వెంకటేశ్వరరావు, కౌలు రైతు,
వానపల్లిపాలెం, ఉప్పలగుప్తం మండలం
నగదు జమ చేస్తే గట్టెక్కుతాం
నేను 12 ఎకరాల్లో కౌలుకు వరి సాగు చేస్తున్నాను. వ్యవసాయంలో వరుస నష్టాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 చొప్పున జమ చేసేవారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా వేయలేదు. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా పోర్టల్‌లో అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రూ.2 లక్షలకు పైగా అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. గత ఏడాది తుపాను వల్ల పంట నష్టపోవడంతో మరో రూ.2 లక్షల అప్పుల పాలయ్యాను. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రభుత్వం నగదు జమ చేస్తే కష్టాల నుంచి ఎంతో కొంత బయటపడేవాళ్లం. పంట నష్టం నమోదు చేశారు. తప్ప ఇప్పటి వరకూ ఇవ్వలేదు.
– చల్లా సంతోష్ కుమార్, తాళ్లరేవు, కాకినాడ జిల్లా


