● అధికారుల అంచనాలకు
భిన్నంగా పులి సంచారం
● ఎస్.జగ్గంపేట వద్ద మకాం
ప్రత్తిపాడు రూరల్/శంఖవరం: మూడు రోజులుగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల పరిధిలో సంచరిస్తున్న పులి ఏమాత్రం దొరక్కుండా అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఏలేరు పరీవాహక ప్రాంతం నుంచి గత బుధవారం ప్రత్తిపాడు మండలం ధారపల్లి జలపాతం పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షమైన ఈ పులి.. అక్కడి నుంచి ప్రత్తిపాడు – శంఖవరం సరిహద్దులోని నాగులకొండ (పెద్ద కొండ) వద్ద రెండు రోజుల పాటు మకాం వేసింది. గురువారం సాయంత్రం తాడువాయి వద్ద గేదె దూడపై దాడి చేసి, శుక్రవారం సాయంత్రం వరకూ రాజవరం, మాసంపల్లి మధ్య సరుగుడు తోటల్లో సంచరించింది. మాసంపల్లి – బవురువాక గ్రామాల మధ్య పులి రోడ్డు దాటుతుండగా స్థానికులు చూసినట్లు ప్రచారం జరిగింది. ఆ పులి మెడలో అమర్చిన జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా దాని కదలికలను అటవీ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు పులిని బంధించేందుకు మాసంపల్లి వద్ద సరుగుడు తోటలో బోను ఏర్పాటు చేసి, అందులో ఆవు దూడను కూడా ఉంచారు. దానిని ఎలాగైనా బంధించేందుకు అటవీ శాఖ, రాపిడ్ రెస్పాన్స్ బృందాలు, వెటర్నరీ డాక్టర్లు, నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నిపుణులతో కసరత్తు చేశారు. అయితే, వారి అంచనాలకు పూర్తి భిన్నంగా ఆ పులి రూటు మార్చింది. మాసంపల్లి నుంచి రాజవరం, గొంది, అచ్చంపేట, జి.కొత్తపల్లి మీదుగా ఎస్.జగ్గంపేట వద్ద పెదబాపన్నదొర చెరువు సమీపానికి చేరుకుంది. పులి ఉన్న ప్రాంతానికి ఎస్.జగ్గంపేట కిలోమీటరు దూరంలో ఉంది. పులి ఉన్న ప్రాంతంలో పశువుల మకాం ఉందని సమాచారం. పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. గౌరంపేట, మాసంపల్లి, జగన్నాథపురం, రాజారం, గొంది, జి.కొత్తపల్లి, అచ్చింపేట, ఎస్.జగ్గంపేట తదితర గ్రామాల్లో అధికారులు పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులను పొలాల్లో ఉంచకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పాడి రైతులకు సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో డీఎఫ్‌ఓ రామచంద్రరావు, ఆర్‌ఎఫ్‌ఓ దుర్గా రాంప్రసాద్, సీఐ బి.సూర్య అప్పారావు, తహసీల్దార్ తాతారావు, ఎస్సైలు శ్రీహరిబాబు తదితరులు పర్యటించారు.


