జేసీ నిశాంతి
అమలాపురం రూరల్: ఉష్టోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు జేసీ టి.నిశాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ మేరకు సమీక్షించారు. అలాగే వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన విగ్రహాల వల్ల నెలకొన్న కోర్టు కేసులు పరిష్కార స్థితిగతులపై చర్చించారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు నీరు ఎక్కువగా తాగాలని, వైద్య శాఖ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని, పీహెచ్‌లు, ప్రాంతీయ ఆస్పత్రులలో వడదెబ్బ బాధితుల కోసం 10 పడకలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ కమిషనర్లు వేసవి కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపడంతో పాటు పంచాయతీలు ఎన్జీవోల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో తాగునీరు, వోల్టేజ్ సమస్య విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జాతరలు శాంతియుతంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, డీఎంఅండ్ హెచ్‌ఓ ఎం.దుర్గారావు దొర తదితరులు పాల్గొ న్నారు.
రైతులకు సుఖీభవ,
పీఎం కిసాన్ నిధులు
అమలాపురం రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ మూడో విడత, 22వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలకు జమ అయినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ శుక్రవారం తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1,34,829 రైతు కుటుంబాలకు రూ.77.01 కోట్లు జమ అయినట్టు ఆయన తెలిపారు. జిల్లావ్యా ప్తంగా 1,15,400 రైతు కుటుంబాలకు రూ.23.08 కోట్లు మేర నిధులు జమ కాపడ్డాయన్నారు.


