మద్యం షాపులను మూయించాలి
అమలాపురం రూరల్: నూతన సంవత్సర వేడుకల పేరుతో జరుగుతున్న విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు, మహిళల భద్రత గాలిలో దీపంలా మారుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి డిసెంబర్ 30, 31 జనవరి 1వ తేదీలలో మద్యం షాపులను పూర్తిస్థాయిలో మూసివేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి.దైవ కృప, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారేం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏటా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మందుబాబు మద్యం తాగి అర్ధరాత్రి వేళల్లో చేసే రచ్చతో మహిళలు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు.


