చోరీ కేసులో నిందితుడి అరెస్టు
కడియం: వృద్ధురాలిని బెదిరించి నగదు, బంగారు చెవిదుద్దులు దోచుకున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు కడియం ఇన్‌స్పెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే..కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్‌కు చెందిన దువ్వారపు శాంతమ్మ అనే వృద్ధురాలు ఈ నెల 25వ తేదీన శ్రీకాకుళం నుంచి వచ్చి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో దిగింది. స్టేషన్ బయట ఆమెకు చైతన్య నగర్ వరకూ లిఫ్ట్ ఇస్తానంటూ దాసరి వీర వెంకట దుర్గాప్రసాద్ తన మోటారు సైకిల్ ఎక్కించుకున్నాడు. రాజవోలు నుంచి కడియం ఆవలోకి వచ్చే రోడ్డు సమీపంలో శాంతమ్మకు కత్తితో బెదిరించి బంగారం చెవిదుద్దులు, రూ.5 వేలు లాక్కున్నాడు. ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించి, అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇంటికి చేరుకుని కడియం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నామని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
అదుపు తప్పి.. బోల్తా పడి..
మామిడికుదురు: జాతీయ రహదారిపై పాశర్లపూడి వద్ద మంగళవారం వేకువ జామున ఓ కారు పంట బోదెలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉండడం, కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురం వైపు నుంచి తాటిపాక వైపు వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఎడమ వైపున ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తూ కారులోని నలుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని రాజోలుకు చెందిన 108లో అమలాపురం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు ఢీకొన్న వేగానికి కొబ్బరి చెట్టు నుంచి బొండాలు రాలిపడ్డాయి.


