ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయం
అమలాపురం టౌన్: ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. అమలాపురంలోని జిల్లా ఆర్మ్‌డ్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీస్తు బోధించిన విధంగా ప్రతి ఒక్కరూ కరుణ, దయ, త్యాగం, ప్రేమ వంటి లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అమలాపురం, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, రఘువీర్, ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఆర్మ్‌డ్ ఆర్‌ఐలు కోటేశ్వరరావు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
భార్య దేవుడిచ్చిన మిత్రము
సమన్వయ సరస్వతి సామవేదం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): గృహస్థునకు భార్య దేవుడిచ్చిన మిత్రము అని ధర్మరాజు యక్షుని ప్రశ్నకు సమాధానం చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన 28వ రోజు ప్రవచనం కొనసాగించారు. అష్టకష్టాలలో భార్యా వియోగం ఒకటి, పురుషుని జీవితం భార్య మీద ఆధారపడి ఉన్నదని ఆయన వివరించారు. భారతీయ సారస్వతంలో భార్యకు ఉన్నతస్థానం ఉన్నదని ఆయన వివరించారు. యక్షప్రశ్నలు ఒక ఉపనిషత్తుగా స్వీకరించాలని, కర్ణుని గురించి విశ్లేషణ చేస్తూ, దానవీరశూర కర్ణ అనడం అతిశయోక్తి అని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు.


