కొబ్బరికి మద్దతు ధర లభించేలా సంప్రదింపులు
అమలాపురం రూరల్: కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా కొబ్బరి బోర్డుతో సంప్రదింపులు జరుపుతామని వర్తకులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో అంబాజీపేట కొబ్బరి మార్కెట్ వర్తకులతో సమావేశం నిర్వహించి, కొబ్బరి ధరల హెచ్చుతగ్గులపై సమీక్షించారు.
● శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి సఖినేటిపల్లి మండలం చింతలమోరి నుంచి మామిడికుదురు మండలం కరవాక వరకు సుమారు 22.9 కిలోమీటర్లు పొడవునా డ్రైనేజీ వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని సర్వే, రెవెన్యూ, జలవనరుల డ్రైనేజీ విభాగపు ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు వారితో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.
● జిల్లాకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రూ1.650 కోట్లతో ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిందని కలెక్టర్ అన్నారు. బొబ్బర్లంక నుంచి పైప్‌లైన్ ద్వారా సురక్షిత తాగునీటిని జిల్లా చిట్ట చివరి స్థాయి వరకు సరఫరా చేసేందుకు పైప్‌లైన్ ఏర్పాటుపై సంబంధిత ఇంజినీర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెగా ఇంజినీరింగ్ రూపొందించిన పైప్‌లైన్ ఏర్పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముందుగా తిలకించారు. అలాగే జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా యూరియా, రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు.


