నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలి
మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మా కుమార్తె హనీ వైద్యం కోసం మా అత్తవారి ఊరైన అల్లవరం మండలం నక్కా రామేశ్వరం వచ్చాను. ఇప్పుడు అమలాపురంలో నివాసం. హనీకి మూడేళ్ల వయసులోనే గౌచర్ (గాకర్స్– శరీరంలో రక్తం సరఫరా లోపం (మెటబాలిక్ డిజార్డర్)) అనే అరుదైన వ్యాధి వచ్చింది. దేశంలో ఇలాంటి వ్యాధిగ్రాస్తులు 14 మంది మాత్రమే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. నాకు, నా భార్య నాగలక్ష్మికి గుండె పగిలేంత దుఃఖం తన్నుకొచ్చింది. హనీ వైద్యానికి రూ.లక్షలు ఖర్చవుతుందని తెలిసి ఏం చేయాలో పాలుపోలేదు. 2020 సెప్టెంబరు 26న సీఎం జగన్ పి.గన్నవరం పర్యటనకు వచ్చారు. ఇది తెలిసి జగన్ వెళ్లే దారిలో మా పాపను నెత్తిన ఎక్కించుకుని ‘తన ప్రాణాలు కాపాడాల’ని ప్లకార్డు పట్టుకుని అర్థించాను. దానిని చూసి తన వద్దకు వచ్చిన జగన్ పాపకు వెంటనే వైద్యం అందించాలని పక్కనే ఉన్న కలెక్టర్ హిమాంశు శుక్లాను ఆదేశించారు. హనీ వైద్యానికి రూ.కోటి మంజూరు చేశారు. మా చిన్నారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చే ఇంజక్షన్ ఖరీదు రూ.74 వేలు ఉంది. 2022 అక్టోబర్ 2న అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో హనీకి తొలి ఇంజెక్షన్ ఇచ్చారు. 2024 వరకూ వైద్యం అందడంతో పాప త్వరగానే కోలుకుంది. ఉచిత విద్యకు భరోసాలో భాగంగా సమనసలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో హనీకి ఉచిత విద్య అందుతోంది. ఈ ప్రభుత్వంలో ఆరు నెలలుగా ఇంజెక్షన్లు నిలిపివేసి తిరిగి ఇప్పుడు అందిస్తున్నారు. నేడు మా హనీ జీవించి ఉందంటే అది జగన్ చలవే. జగన్ నిండు నూరేళ్లూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. మాలాంటి పేదలను ఇలానే ఆదుకోవాలి.
– కొప్పాడి రాంబాబు (తండ్రి), నాగలక్ష్మి (తల్లి)


