టెండరింగ్‌లో రీచ్‌లు!
సాక్షి, అమలాపురం/రావులపాలెం: అదే సన్నివేశం. అదే ఫలితం. ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలవడం.. ఆ సిండికేటే ముందుగా నిర్ణయించుకున్న ధరలకు టెండర్లు వేయడం.. వారికే టెండర్లు దక్కడం.. అంతా సేమ్ టూ సేమ్. గత ఏడాది జరిగినట్టే ఇప్పుడూ జరిగింది. జిల్లాలో నాలుగు రీచ్‌లకు నిర్వహించిన టెండర్లు ఆ మూడు కంపెనీలకే దక్కాయి. గోదావరి వరద ఉరవడి తగ్గడంతో జిల్లా ఇసుక కమిటీ నాలుగు ర్యాంపులకు టెండర్లు పిలిచింది. దీనిలో కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరం (2.02 లక్షల టన్నులు), ఆలమూరు మండలం జొన్నాడ (3.15 లక్షల టన్నులు), ఆలమూరు (2.7 లక్షల టన్నులు), ఆత్రేయపురం మండలం మెర్లపాలెం (0.72 లక్షల టన్నులు)లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ఈ రీచ్‌లకు టెండర్లు పిలిచారు. మొత్తం నాలుగు రీచ్‌లలో 8,57,200 లక్షల టన్నుల ఇసుక తవ్వకాల కోసం ఈ టెండర్లు పిలిచారు. ఈ నెల 12వ తేదీన మరో నాలుగు కొత్త ఇసుక ర్యాంపులను అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా ఇసుక కమిటీ దరఖాస్తులు ఆహ్వానించింది. స్క్రూట్నీ, టెక్నికల్ బిడ్ వంటి అంశాలను పరిశీలించిన అనంతరం 4 ర్యాంపులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను అధికారులు ప్రకటించారు. జిల్లాలలో ఇసుక తవ్వకాల కోసం ఏర్పడిన సిండికేటులోని కంపెనీలకే మరోసారి ఈ టెండర్లు దక్కడం గమనార్హం. జొన్నాడ రీచ్‌ను ఆర్‌ఎస్‌ఆర్ సంస్థ టన్ను ఇసుక తవ్వకానికి రూ.72, కపిలేశ్వరపురంలో జీఎస్‌ఆర్ సంస్థ రూ.67, మెర్లపాలెం, ఆమూరులు రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.69 చొప్పున టెండర్లు వేసి దక్కించుకున్నారు. మొత్తం 23 మంది టెండర్లు వేయగా తక్కువకు కోట్ చేసిన వీరికి టెండర్లు ఖరారైనట్టు మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో సెమీ మెకనైజ్డ్, మ్యానువల్ కలిపి మొత్తం 14 రీచ్‌ల వరకు ఉన్నాయి. వీటికి కేవలం 9 కంపెనీలు మాత్రమే టెండర్లు వేస్తుండడం విశేషం. అధికారిక ర్యాంపులన్నీ మండపేట, కొత్తపేట నియోజకవర్గాలలో ఉన్నాయి. ఇక్కడ అధికార పార్టీ కీలక నేతల ప్రమేయంతోనే రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరగడం, అమ్మకాలు వంటివి జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. వీరి ప్రమేయం ఉన్న సిండికేటు కంపెనీలు తప్ప బయట వ్యక్తులు టెండర్లు వేసే అవకాశం లేకుండా పోయింది. కాదని రీచ్‌లు దక్కించుకుంటే తవ్వకాలు చేయలేరంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
గత ఏడాది ఇదే సమయంలో జిల్లాలో శాండ్ కమిటీ నిర్ణయించిన 20 స్టాక్ పాయింట్లు 16 ర్యాంపులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12 ర్యాంపులకు కుదించడంలో సిండికేట్ విజయం సాధించింది. అలాగే అమలాపురం మండలం కామనగరువు, రావులపాలెం మండలం గోపాలపురం, రావులపాడు, ఆలమూరు మండలం జొన్నాడ, కపిలేశ్వరపురం మండలం తాతపూడిలో ఎగుమతులను నిలిపివేయడంలో వారు విజయం సాధించారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఎనిమిది ర్యాంపులు కాకుండా కొత్తగా జొన్నాడ, కపిలేశ్వరపురం, మెర్లపాలెం, ఆలమూరు ర్యాంపులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వీటిలో జొన్నాడ, మెర్లపాలెం గ్రామాల్లో వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ర్యాంపులు సాధించడంలో సిండికేట్ వ్యూహం ఫలించింది. అలాగే ర్యాంపుల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఉన్న గ్రామాల్లోని ర్యాంపులలో ఇసుక పరిమాణం లేదని చూపి, ఆ ర్యాంపులను మూసివేయించడంలో సిండికేట్ తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో కొత్తగా ఇచ్చిన 4 ర్యాంపులలో రెండు జొన్నాడ, మెర్లపాలెం, ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఊబలంక ఏ, ఊబలంక బి, ఊబలంక–2 (మ్యాన్యువల్,) రీచులను ఆనుకుని ఉన్న చోట తీసుకురావడంలో సిండికేట్ వ్యూహం ఫలించినట్టైంది.
జిల్లాలో ఇప్పటికే 8 రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్న విషయం తెలిసిందే. ఆయా రీచ్‌లలో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణ కూడా ఉన్నాయి. ఇసుక సరిపడినంత దొరకడం లేదని, దీని వల్లే ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నందున కొత్త రీచ్‌లకు అనుమతులు ఇచ్చామని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కొత్త రీచ్‌ల నుంచి ఇసుక రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని కొత్త భాష్యం చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న రీచ్‌ల మీద కూడా సిండికేటు హవా నడుస్తున్న విషయం తెలియంది కాదు. కొత్త రీచ్‌ల మీద కూడా వారి పెత్తనమే కొనసాగుతోంది. అటువంటప్పుడు ధరలు ఎలా దిగివస్తాయనేది అధికారులు చెప్పాలి మరి.
సిండికేట్‌కే నాలుగు ర్యాంపులు
8.57 లక్షల టన్నుల
ఇసుక తవ్వకాలకు అనుమతి
మమ్మల్ని కాదని చేయలేరంటూ
బయటి వ్యక్తులకు బెదిరింపులు
గత ఏడాది తక్కువ ధరకు
బిడ్డింగ్ వేసిన బయటి వ్యక్తులు
సాంకేతిక కారణాలు చూపి టెండర్ల రద్దు
టెండరింగ్‌లో రీచ్‌లు!


