మేధో మధనానికి పదును
● 22న జిల్లా విద్యా, వైజ్ఞానిక
ప్రదర్శనకు ఏర్పాట్లు
● 176 ప్రాజెక్టుల ప్రదర్శనకు సిద్ధం
● జిల్లా స్థాయి ప్రదర్శనకు వేదికగా
● అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల
రాయవరం: పాఠ్య పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానంతో ఆలోచనలకు పదును పెడితే సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఇన్‌స్పైర్ మనక్, బాలల సైన్స్ కాంగ్రెస్, జాతీయ సైన్స్ దినోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఈ నెల 22న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు చురుగ్గా ఏర్పాట్లు చేపడుతున్నారు. అంతకు ముందుగా ఈ నెల 18వ తేదీలోపు మండల స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి ప్రదర్శన అమలాపురం బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు.
మూడు కేటగిరీల్లో పోటీలు
ఈ పోటీలను ప్రధానంగా మూడు కేటగిరీల్లో ఏడు విభాగాల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులు వ్యక్తిగతంగా, గ్రూపుగా పోటీ పడవచ్చు. ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కూడా పోటీల్లో పాల్గొనే అవకాశముంది. ఉపాధ్యాయ విభాగంలో పోటీ పడేవారు ఏడు విభాగాల్లో ఏదో ఒక దానిని ఎంచుకుని ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. వ్యక్తిగత విభాగంలో పోటీ పడే విద్యార్థులు ఏడు అంశాల్లో ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని గైడ్ టీచర్‌తో కలిసి పోటీ పడవచ్చు.
ఎవరెవరు పాల్గొనవచ్చు..
ప్రతి పాఠశాల నుంచి విద్యార్థి వ్యక్తిగత, గ్రూపు, టీచర్ విభాగం నుంచి ఒక్కొక్క ప్రాజెక్టును మాత్రమే మండల స్థాయిలో ప్రదర్శించాలి. అక్కడ సాధారణ పాఠశాలలతో పాటుగా, అటల్ ల్యాబ్ ఉన్న పాఠశాలలు కూడా ప్రత్యేకంగా పాల్గొనవచ్చు. అటల్ ల్యాబ్‌లో తయారు చేసిన ప్రాజెక్టులు మాత్రమే ప్రదర్శించాలి. అలాగే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల ప్రాజెక్టులు నేరుగా జిల్లా స్థాయికి నామినేట్ అవుతాయి. జిల్లా స్థాయిలో వ్యక్తిగత విభాగం, గ్రూపు, టీచర్స్ విభాగాల నుంచి ఒక్కో విభాగం నుంచి రెండు ప్రాజెక్టుల వంతున మొత్తం ఆరు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 23న విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తిగత విభాగాల నుంచి 15 ప్రాజెక్టులను, గ్రూపు విభాగాల నుంచి పది, ఉపాధ్యాయ విభాగం నుంచి పది ప్రాజెక్టులు మొత్తంగా 35 ప్రాజెక్టులను రీజనల్ స్థాయికి పంపిస్తారు. రీజినల్ స్థాయిలో తొమ్మిది రాష్ట్రాల నుంచి పోటీ పడతారు. ఈసారి రీజినల్ స్థాయి పోటీలను 2025 జనవరి 18, 19, 20 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. రీజినల్ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు పోటీ పడతాయి.
22న జిల్లా స్థాయిలో..
ఈ నెల 22న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల వేదిక కానుంది. జిల్లా సైన్స్ విభాగం ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల, మండల, జిల్లా స్థాయి ప్రదర్శనలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలంటూ ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ పి.నాగేశ్వరరావు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో మండల నుంచి ఐదు ప్రాజెక్టుల వంతున జిల్లాకు 176 ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. టీచర్స్ నుంచి ఒకటి, వ్యక్తిగత కేటగిరీ నుంచి రెండు, సామూహిక కేటగిరీ నుంచి రెండు వంతున ఎంపిక చేసి ప్రదర్శిస్తారు.
ఏడు విభాగాలివీ..
ససై ్టనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్, గ్రీన్ ఎన ర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, రీ క్రియేషన్ మేథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజిన్, వాటర్ కన్జర్వేటింగ్ అండ్ మేనేజ్‌మెంట్.
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాలి
జిల్లా స్థాయి ప్రదర్శనకు నాణ్యమైన ప్రాజెక్టులు రూపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో మన జిల్లా ప్రతిభ కనబరచేలా ప్రాజెక్టులు రూపొందించాలి.
– గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం,
జిల్లా సైన్స్ అధికారి, అమలాపురం.
మేధో సంపత్తికి పదును పెట్టేందుకు
విద్యార్థుల్లోని మేధా సంపత్తికి పదును పెట్టేందుకు, ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన దోహదం చేస్తుంది. ఈ ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.
– పి.నాగేశ్వరరావు, డీఈవో,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
మేధో మధనానికి పదును
మేధో మధనానికి పదును


