సత్యదేవుని భక్తులపై ‘ధరా’భారం!
అన్నవరం: సత్యదేవుని భక్తులపై ధరాభారం పడనుంది. అన్నవరం దేవస్థానంలో వివిధ సేవల టికెట్లు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం తెలిపారు. పెంపుదల ప్రతిపాదనలను పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని గ్రామస్తులను, భక్తులను కోరారు.
ఇవీ ప్రతిపాదనలు
● యంత్రాలయంలో అంతరాలయ దర్శనం టి కెట్టు ఒక్కొక్కరికి ప్రస్తుతం రూ.50 ఉంది. దీనిని రూ.100కు పెంచాలని ప్రతిపాదించారు.
● ప్రతి రోజూ సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకూ ఆలయంలో నిర్వహిస్తున్న పంచహారతుల సేవ టికెట్టు ప్రస్తుతం దంపతులకు రూ.500గా ఉంది. దీనిని ఒక్కరికి రూ.500, దంపతులకు రెండు టిక్కెట్లు రూ.1,000కి పెంచాలని యోచిస్తున్నారు. ఈ టికెట్టుపై భక్తులకు ఇస్తున్న 125 గ్రాముల ప్రసాదాన్ని ఒక్కో టికెట్టుకు 150 గ్రాములకు పెంచనున్నారు.
● ప్రతి నెలా స్వామివారి జన్మనక్షత్రం మఖనాడు సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల మూలవిరాట్‌లకు నిర్వహించే పంచామృతాభిషేకం టికెట్టు దంపతులకు రూ.3 వేలుగా ఉంది. దీనిని రూ.5 వేలకు పెంచాలని ప్రతిపాదించారు.
● పదేళ్లు దాటిన పిల్లలకు కూడా ఇకపై టికెట్టు తీయాలని నిర్ణయించారు.
● ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు, సలహాలను 94907 12066, 94912 13887, 99084 11777 నంబర్లకు వాట్సాప్ ద్వారా జనవరి 20లోగా పంపించాలి. అలాగే, endow-eoannavaram@gov.in ద్వారా ఈ–మెయిల్ కూడా చేయవచ్చని ఈఓ తెలిపారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర
కమిటీల్లో నియామకాలు
సాక్షి, అమలాపురం: పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలువురిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలలో నియమించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అనుబంధ విభాగాలలో (పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం) రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మల్లం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా తోరం భాస్కరరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా పితాని నరసింహారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా కనుమూరి సత్యనారాయణరాజులను నియమించారు.
మహలక్ష్మి ఆలయ నిర్మాణానికి
రూ.2 లక్షల విరాళం
పి.గన్నవరం: ఎల్.గన్నవరంలో కొలువైన గ్రామ దేవత మహలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన అంబటి వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.2,02,114 విరాళంగా అందించారు. అలాగే యర్రంశెట్టి వినయ్ వెంకటేష్ రూ.10,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంబటి సత్యనారాయణ, దుర్గారావు, రాముడు, డొక్కా మూర్తి, దూళిపూడి శ్రీనివాసరావు, అన్నాబత్తుల అనుబాబు, అడబాల రంగరావు, గనిశెట్టి ఈశ్వర్, యర్రంశెట్టి రామకృష్ణ, చిట్టాల జోగేశ్వరరావు, పాటి చిట్టిబాబు, చిట్టాల ఆర్యశ్రీను తదితరులు పాల్గొన్నారు.
సత్యదేవుని భక్తులపై ‘ధరా’భారం!


