పుష్కరాలకు సమగ్ర ప్రణాళికలు
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పుష్కరాల కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జిల్లాలో పుష్కరాలకు సుమారు రెండు కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 182 పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.1,20,061 విలువైన అంచనాలను దేవదాయ శాఖకు సమర్పించామని వివరించారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 182 పుష్కర ఘాట్లలో ముఖ్యమైనవి వాడపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, కోటిపల్లి, సోంపల్లి, అంతర్వేది, ముక్తేశ్వరం ఉన్నాయన్నారు. పుష్కరాల ప్రత్యేకాధికారి వీర పాండియన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించనున్నట్టు తెలిపారు.
యూరియా, ఎరువుల పంపిణీకి చర్యలు
జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రబీలో అన్ని పంటలకు అవసరమైన 29,241 మెట్రిక్ టన్నుల యూరియా, ఎరువులు పంపిణికి ప్రణాళిక సిద్ధపరచడం జరిగిందన్నారు. శుక్రవారం నాటికి 3794 టన్నుల యూరియా, 2,300 టన్నుల డీఏపీ, 1210 టన్నుల పొటాష్, 7823 టన్నుల కాంప్లెక్స్, 927 టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులను పీఏసీఎస్‌లు, ఆర్‌ఎస్‌కేలు తదితర కేంద్రాల్లో నిల్వ ఉంచినట్టు తెలిపారు.
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
కలెక్టర్ మహేష్ కుమార్
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,48,942 మంది పిల్లలు, 3,624 హైరిస్క్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ కార్యక్రమంపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లాలో 22 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 47 పీహెచ్‌సీలు, 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 9 సీహెచ్‌సీలు, రెండు ప్రాంతీయ ఆస్పత్రులలో సుమారు 1,850 బృందాల ద్వారా 978 బూత్‌లు, 53 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. శనివారం టాంటాం వేయించి, బ్యానర్లు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ దుర్గారావు దొర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బీవీవీ సత్యనా రాయణ పాల్గొన్నారు.


