కార్పెంటర్ల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: కార్పెంటర్ల (వడ్రంగి మేసీ్త్రలు) సంక్షేమంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జిల్లా కార్పెంటర్లు, చేతి వృత్తుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా సంఘం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాతుతూ గృహ నిర్మాణాలకు సంబంధించి రెడీమేడ్ వస్తువులు మార్కెట్‌లోకి వచ్చి కార్పెంటర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఆంక్షలను తుంగలో తొక్కి రెడీమేడ్ గుమ్మాలు, తలుపులు, కిటికీల విక్రయాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కార్పెంటర్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించి అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు గున్నేపల్లి భీమశంకరం, కొనుకు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రఘురామను పదవి నుంచి
తొలగించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా ఽఅధికార ప్రతినిధి రామకృష్ణ
ముమ్మిడివరం: బ్యాంకులను మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజును తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తానని చెప్పి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించకుండా ఎగవేసిన రఘురామ కృష్ణంరాజుపై మరిన్ని కేసులు నమోదు చేయాలని కోరారు. ఆయన సంస్థలుగా ఉన్న ఇండ్ భారత్ పవర్.. ఇండ్ భారత్ ఇన్‌ఫ్రాతో పాటు మరిన్ని అనుబంధ కంపెనీల పేరుతో రూ.947 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన చేశారన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బ్యాంకులను మోసం చేయడమే కాకుండా ప్రజలను సైతం మోసం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు.
‘తూర్పు’ పోలీసు విభాగానికి
ఏబీసీడీ అవార్డు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు సాధించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఈ అవార్డు అందుకున్నారు.
కార్పెంటర్ల సమస్యలు పరిష్కరించాలి


