
డ్రగ్స్ రహిత రాష్ట్ర సాధనే ఈగల్ లక్ష్యం
రాజానగరం: రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ఈగల్ లక్ష్యమని, దీని కోసం జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఐజీ ఈగల్ చీఫ్ ఆర్‌కే రవికృష్ణ తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ కన్వెన్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ వీక్, సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ అవేర్‌సెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 40 వేల విద్యాసంస్థలలో ఈగల్ కమిటీలను ఏర్పాటు చేసి, అవగాహన కలిగిస్తున్నామన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండటంతో పాటు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. భయం, దురాశ, వ్యామోహం, అవమానం వంటివి సైబర్ నేరాల పెరుగుదలకు కారణాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా 1930 టోల్‌ఫ్రీ నంబరుకు తెలియజేయాలన్నారు. నన్నయ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్’ అనే నినాదంతో జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితాలే కాదు కుటుంబాలే నష్టపోతాయని, ర్యాగింగ్‌కు పాల్పడితే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఈగల్ ఎస్పీ కె.నగేష్ బాబు మాట్లాడుతూ భయం, అభద్రతా భావాలతో మనుషులు జీవించరాదని, ఆనందమైన జీవనాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్యశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కెవిస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈగల్ చీఫ్ రవికృష్ణ నన్నయ వర్సిటీలో సదస్సు