
గోపవరంలో ‘తారాజువ్వ’ వివాదం
నిడదవోలు రూరల్: ఇంటిలోకి తారాజువ్వ దూసుకురావడంతో ప్రశ్నించిన వ్యక్తిపై యువకులు దాడికి పాల్పడ్డారు. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలా జీ సుందరరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం గోపవరంలో సోమవారం రాత్రి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కొందరు యువకులు రోడ్డుపై బాణసంచా కాల్చారు. ఆ సమయంలో ఓ తారాజువ్వ లారీ డ్రైవర్ ఖండవల్లి శ్యాంబాబు ఇంటిలోకి దూసుకువెళ్లింది. దీంతో శ్యాంబాబు ఆ యువకులను నిలదీశాడు. ఈ నేపథ్యంలో వేముల నాగేంద్ర, ఆరేపల్లి దిలీప్, వేముల సాయి, ఆరేపల్లి గాంధీతో పాటు మరికొందరు యువకులు.. శ్యాంబాబుపై ఇటుకలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి యువకులను అదుపులోకి తీసుకున్నారు. తలకు తీవ్ర గాయాలైన శ్యాంబాబును నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుపై సమిశ్రగూడెం పోలీసులు పలువురి యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ పరిశీలించారు. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు శ్యాంబాబును కలిసి దాడి ఘటన విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోపవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
యువకుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
నిడదవోలు ఆస్పత్రిలో చికిత్స

గోపవరంలో ‘తారాజువ్వ’ వివాదం