
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
8లో..
● గోదావరి దోబూచులాట
● శబరి పోటెత్తడంతో ఎక్కువైన ఉధృతి
● ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీరు విడుదల
● దిగువన లంకలకు పెరిగిన వరద
కనకాయలంక కాజ్‌వేపై వరద నీటిలో నడిచి వెళుతున్న విద్యార్థులు, ప్రజలు
పి.గన్నవరం అక్విడెక్టు వద్ద వరద ఉధృతి
తగ్గుతూ.. పెరుగుతూ..
సాక్షి, అమలాపురం: వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు నిజమే అన్నట్టుగా గోదావరిలో ఒక్కసారి వరద పెరిగి కోనసీమ వాసులను ఆందోళనకు గురి చేసింది. కేవలం 12 గంటల్లో వరద ఉధృతి భారీగా పెరగడంతో అధికారులు హైరానా పడ్డారు. అయితే తరువాత నుంచి ఎగువ భద్రాచలం, పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీల వద్ద తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోదావరి ఎగువన గల తెలంగాణలోని పలు ప్రాజెక్టుల నుంచి నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో బుధవారం రాత్రి నుంచి వరద మరోసారి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక్కసారిగా పెరిగి..
గోదావరి వరద జిల్లా వాసులతో దోబూచులాడుతోంది. గత శుక్రవారం రాత్రి నుంచి వరద పెరగడం, తగ్గడం జరుగుతోంది. అయితే సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు ఒక్కసారిగా పెరిగింది. సోమవారం రాత్రి ఆరు గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 6,07,682 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు. అయితే తర్వాత నుంచి వరద అనూహ్యంగా పెరిగింది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో బ్యారేజీ నుంచి 8,23,083 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వదిలారు. ఒక్కసారిగా వరద పెరగడంతో పాటు ఈ సమయంలో ఎగువన భద్రాచలం వద్ద కూడా ఉధృతి అధికంగా ఉండడంతో దిగువన లంక వాసులు, జలవనరులు, రెవెన్యూ అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే తరువాత నుంచి వరద తగ్గడం మొదలైంది. గోదావరి ప్రధాన నదితో పాటు ఉప నది శబరి నుంచి పోటెత్తడంతో వరద పెరిగింది. అనంతరం క్రమంగా తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 7,61,210 క్యూసెక్కులకు తగ్గగా, సాయంత్రం ఆరు గంటల సమయానికి 7,40,578 క్యూసెక్కులకు చేరుకుంది.
నీట మునిగిన కనకాయలంక కాజ్‌వే
గోదావరి వరద ప్రభావం జిల్లాలో పి.గన్నవరంపై అధికంగా ఉంది. మండలంలోని చాకలిపాలెం శివారు కనకాయలంక కాజ్‌వే మంగళవారం వరద నీట మునిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయిలంక వాసులు ఈ కాజ్ వే మీదుగానే వాహనాలు, ఆటోల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు అడుగున్నర లోతున వరద నీటిలో ప్రయాణిస్తున్నారు. కాజ్‌వే వద్ద వరద ఉధృతి పెరిగితే పెరిగితే పడవలు ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
పడవలపై రాకపోకలు
పి.గన్నవరం మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. అలాగే కోనసీమ జిల్లాకు సరిహద్దులో ఉన్న పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్టును తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. ఈ మండలం చుట్టూ గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలలో వరద పెరగడం లంక వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. అయినవిల్లి మండలం తొగరిపాయ వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు బారిన పడే ప్రాంతాలు, ఏటిగట్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా డీఆర్వో కొత్తా మాధవి అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో పర్యటించారు.
నేటి రాత్రి నుంచి పెరిగే అవకాశం
గోదావరికి బుధవారం రాత్రి నుంచి వరద పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని గోదావరిపై అతి పెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు గోదావరి ఉప నదుల నుంచి నీరు విడుదల చేరుతున్నందున తిరిగి వరద పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అయినవిల్లి మండలం తొగరపాయ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద
పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో పడవపై వెళుతున్న లంక గ్రామాల ప్రజలు

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025