కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం నుంచి న్యాయ విభాగం నియామక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ వివరాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు 25,173 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని అన్ని జ్యుడీషియల్ జిల్లాల్లో స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి విభాగంలో ఉదయం 7.30 నుంచి 8.45 మధ్య అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. 9 నుంచి 10.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. రెండో విభాగంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి 12.15 వరకు లోపలికి అనుమతి, 12.30 నుంచి 2 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. మూడో విభాగానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 3.45 వరకు లోపలికి అనుమతి, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
ఫలితాలే ఎంపికకు ప్రామాణికం
పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే సెంటర్ గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్, చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫొటో ఐడీ వెంట తీసుకురావాలి. హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ సమస్యలకు హెల్ప్‌డెస్క్ ఫోన్ నంబర్ 0863 2372752, ఈ–మెయిల్ హెచ్‌సీ.ఏపీ.ఎట్‌దరైటాప్ ఏఎల్‌జే.గవ్.ఇన్ లో సంప్రదించాలి. పరీక్షల ఫలితాలే అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికం. ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించరు. స్టేనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ పోస్టులకు విడిగా నైపుణ్య పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రా లకు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కేంద్రంలో సమస్యలపై సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అలాగే 0863 2372752 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
● కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెం వద్ద సాఫ్ట్ టెక్నాలజీస్ కేంద్రం, అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర నున్న ఆయాన్ డిజిటల్ జోన్‌లో ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
● సూరంపాలెం అదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 24న నిర్వహిస్తారు.
● రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో 20, 21. 22, 24 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
● అమలాపురం పరిధిలోని అభ్యర్థులకు చెయ్యేరు శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భట్లపాలెంలోని బీవీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు.
నేటి నుంచి 24 వరకూ నిర్వహణ
ఉమ్మడి జిల్లాలో పూర్తయిన ఏర్పాట్లు