
నకిలీ దస్తావేజులతో స్థలాల రిజిస్ట్రేషన్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ దస్తావేజులు సృష్టించి స్థలాలను విక్రయిస్తున్న ఐదుగురి సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి గతంలో రాజమహేంద్రవరంలో డాక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో 1997లో తన పెద్ద కుమారుడు వినోద్ పేరున కవలగొయ్యిలో 267 చదరపు గజాలు, దివాన్ చెరువులో 267 చదరపు గజాలు, చిన్న కుమారుడు లక్ష్మణ్ పేరున దివాన్ చెరువులో 267 చదరపు గజాల స్థలాలను కొనుగోలు చేశారు. అయితే విశాలక్షి భర్త వెంకటేశ్వరరావు 2012లో చనిపోవడంతో ఆమె తన స్వగ్రామం కుప్పనపూడికి వెళ్లిపోయారు. ఆమె కుమారులు ఉద్యోగాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విశాలాక్షి కూడా అమెరికా నుంచి ఇటీవల తన స్వగ్రామానికి వచ్చారు. తన ఆస్తుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పరిశీలించగా, వాటిని వేరొకరు కాజేసినట్టు గుర్తించారు. దీనిపై ఈ ఏడాది జూన్ 14న బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ముఠాగా ఏర్పడి..
కాకినాడకు చెందిన షేక్ ఫకీర్ మహమ్మద్ ఖాసిం బాషాకు 2013 జనవరిలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పనిచేసే రాజమహేంద్రవరానికి చెందిన మద్దిరెడ్డి లక్ష్మీనారాయణ, మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ (సిటీ బస్సు ప్రసాద్) పరిచయమయ్యారు. ఎక్కువ కాలం ఖాళీగా ఉండి, ఎవ్వరూ పట్టించుకోకుండా ఉన్న స్థలాల దస్తావేజు జిరాక్సులు తెస్తే, వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, అధిక ధరకు విక్రయించుకుందామని చెప్పాడు. దానికి మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో కాశీ విశాలాక్షి కుమారుల స్థలాలకు నకిలీ దస్తావేజులు తయారు చేసి, రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం బయటకు వారికి విక్రయించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల ప్రకారం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య ఆధ్వర్యంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్, సబ్బితి భాస్కరరావును ఆదర్శనగర్‌లో, షేక్ ఫకీర్ మహమ్మద్ ఖాసిం బాషా, యాదగిరి సురేష్, గాలి రాజేంద్ర ప్రసాద్‌లను ఈస్ట్ రైల్వే గేటు వద్ద బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం అరెస్టుచేశారు.
ఐదుగురి సభ్యుల ముఠా అరెస్టు
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీవిద్య