
మేధోమంథన్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థుల్లో దాగిన ప్రతిభ, ఆలోచన, ఆవిష్కరణలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తుంది. దీనిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, దేశంలోని సీఎస్‌ఐఆర్, ఐఎస్‌ఆర్డీఓ, బార్క్, డీఆర్డీఓ తదితర ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశంతో పాటు ఇంటర్న్‌షిప్, స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీవీఎం ఈ పరీక్షపై జిల్లాలోని విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 6వ తరగతి నుంచి 11వ తరగతి (ఇంటర్ ఫ్రథమ సంవత్సరం) వరకూ చదువుతున్న వారందరూ దీనికి అర్హులే.
జాతీయ స్థాయిలో..
ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివే వారందరూ దీనికి అర్హులే. దీనిలో ప్రతిభ కనబర్చిన వారికి దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్, స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు పక్రియ ప్రారంభమైంది.
ఆన్‌లైన్‌లో అవకాశం
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30 వరకూ గడువు ఉంటుంది. ఆన్‌లైన్‌లో పాఠశాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. 6వ తరగతి నుంచి 11 (ఇంటర్ మొదటి సంవత్సరం) తరగతుల వరకూ విద్యార్థులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిషు తదితర భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.
మాక్ పరీక్షలు
ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకూ ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారికి సెకండ్ లెవెల్ (ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్‌లైన్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19వ తేదీన జరుగుతుంది.
జాతీయ స్థాయికి ఎంపిక ఇలా..
రాష్ట్ర స్థాయి విజేతల్లో ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరం పాటు ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్‌డీఓ, ఇస్రో, సీఎస్‌ఐఆర్, బీఏఆర్సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగ శాలలు, పరిశోధన సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్ షిప్‌కు అవకాశం కల్పిస్తారు.
ప్రతిభ ఉంటే.. భవిత మీదే
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం)
పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ స్థాయిలో నిర్వహణ
స్కాలర్‌షిప్‌తో పాటు అనేక ప్రయోజనాలు
6వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ
సంవత్సరం విద్యార్థులు అర్హులు
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అవకాశం
విస్తృతంగా అవగాహన
విజ్ఞాన్ మంథన్ పరీక్షల్లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఉపకార వేతనంతో పాటు ప్రఖ్యాత పరిశోధనా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని కలిగించి, నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి కలిగినవారు వీవీఎం అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.
– పిల్లి రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా

మేధోమంథన్

మేధోమంథన్