సమస్యలు చెట్టుముట్టాయి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు చెట్టుముట్టాయి

Aug 17 2025 6:15 AM | Updated on Aug 17 2025 6:15 AM

సమస్య

సమస్యలు చెట్టుముట్టాయి

మలికిపురం: ‘ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయనే’ నిజాన్ని ప్రస్తుతం రాజోలు దీవి ప్రజలు కళ్లారా చూస్తున్నారు. కొడుకుని నమ్ముకునే కంటే కొబ్బరి చెట్టును నమ్ముకుంటే చాలు, జీవితం గడిపేయచ్చని ఓ సినిమాలో సన్నివేశం ఉంది. ఇక్కడ కొడుకులను అవమానించడం కాదు కాని కొబ్బరి గొప్పదనం అది. అటువంటి పంట ప్రమాదంలో చిక్కుకుంది. కోనసీమలో ప్రతి ఇంటి ఆవరణలో ఉండే పది కొబ్బరి చెట్ల సాయంతో కుటుంబం నడిపే పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం రాజోలు దీవిలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్న తీరు కుంగదీస్తోంది. ఇలా ఇప్పటికే సుమారు 20 వేల మంది రైతుల ఆర్థిక పరిస్థితి తారుమారు అయ్యిందని అంచనా.

ఉప్పు.. అదే ముప్పు

రాజోలు దీవిలో సుమారు 45 వేలకు పైగా ఎకరాల్లో కొబ్బరి సాగు ఉండేది. 2020 సంవత్సరం నుంచీ ఇక్కడ ఉప్పునీటి బారిన పడి కొబ్బరి తోటలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఇప్పటికే సుమారు పది వేల ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు మోడుబారాయి. మరిన్ని తోటలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. దీనివల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మారుతున్న భౌగోళిక కారణాలతో పాటు ఓఎన్జీసీ వంటి ఆయిల్‌ సంస్థల అన్వేషణ, చమురు వెలికితీత, ఇష్టానుసారంగా రొయ్యల సాగు వంటి కారణాలతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఈ దీవిలో ప్రధానంగా శంకరగుప్తం క్రీక్‌ (డ్రైన్‌) పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో ఈ ప్రభావం అఽధికంగా ఉంది. శంకరగుప్తం డ్రైన్‌లో కలిసే కూనవరం, వేప చెట్టు, గోగన్నమఠం మీడియం డ్రైన్ల పరివాహక ప్రాంతాల భూముల్లో కూడా ఈ దుస్థితి నెలకొంది. సముద్ర పోటు ప్రభావంతో ఉప్పునీరు ఈ క్రీక్‌లోకి వస్తోంది. మామిడికుదురు మండలం కరవాక నుంచి ప్రవేశించే ఈ డ్రైన్‌ గోగన్నమఠం, కాట్రేనిపాడు, గొల్లపాలెం, తూర్పుపాలెం, పల్లిపాలెం, గూడపల్లి, గుబ్బలపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, శంకరగుప్తం, బట్టేలంక, కత్తిమండ, అడవిపాలెం, చింతలమోరి మోరిపోడు, మోరి, కేశవదాసుపాలెం గ్రామాల మీదుగా కేశవదాసుపాలెం వద్ద సముద్రం వద్ద ముగుస్తుంది. ఇందులో రాజోలు దీవిలోని అన్ని ప్రధాన మీడియం, మైనర్‌ డ్రైన్లు కలసి మురుగు నీటిని కరవాక, గోగన్నమఠం గ్రామాల వద్ద వైనతేయ నదిలో కలుపుతుంది. ఈ డ్రైన్‌ పరిధిలో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. అయితే ఉప్పునీటి ప్రభావం నానాటికీ అధికం కావడంతో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. దీనివల్ల కొబ్బరి తోటల ఆదాయంతోనే ఆధారపడిన అనేక మంది రైతులు, నిరు పేదలు తీవ్రంగా నష్ట పోతున్నారు. కొబ్బరిపై ఆధార పడిన రైతులు, వ్యాపారులు, కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నాలుగేళ్లుగా వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి ఉద్యాన, కొబ్బరి పరిశోధన శాస్త్రవేత్తలు వచ్చారు, వెళ్లారు. డ్రైనేజీ ఉన్నతాధికారులు సైతం పరిశీలన చేశారు.

అంచనా వేసి.. అధ్యయనం చేసి

గత కొన్నేళ్లుగా సముద్ర నీటిమట్టం పెరుగుతోందని శాస్త్రవేత్తల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఉప్పునీటి బెడద అధికమవుతోంది. అంతర్వేది నుంచి కరవాక వరకూ ఉప్పునీరు అధికంగా పైకి రావడం వల్ల ఈ సమస్య తీవ్రమైంది. ఫలితంగా ఇప్పటికే సుమారు 10 వేల ఎకరాల్లో చెట్లు చనిపోగా, మరో 20 వేల ఎకరాలకు ప్రమాదం పొంచి ఉందని అంచనా. ఈ సమస్యలపై కేంద్రం నుంచి వచ్చిన బృందం ఇప్పటికే నాలుగు సార్లు పరిశీలించింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కేరళ నుంచి వచ్చిన కొబ్బరి అభివృద్ధి బోర్డు సభ్యులు, అధికారులు ఇక్కడ అధ్యయనం చేశారు. ఇక్కడ ఉప్పునీటి ప్రభావం వల్లే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని ఆ బృందం గుర్తించింది.

రక్షణ చర్యలు అవశ్యం

ఇక్కడ శంకరగుప్తం డ్రైన్‌లోకి పోటు వల్ల ఉప్పునీరు వస్తుంది. ఇది కొబ్బరి తోటలను ముంచెత్తుతుంది. ఇలా నీరు కొబ్బరి తోటల్లోకి ప్రవేశించకుండా రిటైనింగ్‌ వాల్‌, లేక స్లూయిజ్‌ నిర్మించాలి. అప్పుడే తోటలకు రక్షణ ఉంటుందని రైతులు అధికారులకు చెబుతూనే ఉన్నారు. దీనికి నిధులు ఎక్కడ నుంచి సమీకరించాలనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. శంకరగుప్తం మేజర్‌ డ్రైన్‌కు ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలంటే ఖర్చు అధికంగా అవుతుంది. సుమారు 26 కిలోమీటర్ల పొడవు గల ఈ డ్రైన్‌ పరిధిలో పోటు ప్రభావం అధికంగా ఉండే కరవాక నుంచి శంకరగుప్తం వరకూ అయినా సుమారు 15 కిలోమీటర్ల మేర అత్యవసర ప్రాంతాల్లో వాల్‌ కట్టాలంటే దాదాపు రూ.100 కోట్ల ఖర్చు అవుతుందని డ్రైనేజీ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. డ్రైన్‌కు స్లూయిజ్‌ కడితే రూ.30 కోట్ల లోపు అవుతుంది. ఇతర చర్యల కంటే స్లూయిజ్‌ నిర్మాణంతోనే అధిక ఫలితం ఉంటుందని డ్రైనేజీ అధికారులు అంటున్నారు.

కూలి పనులకు వెళ్లాలా..

రైతులకు ఉపాధినిచ్చే విలువైన కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. రూ.లక్షల పెట్టుబడి పెట్టి తోటలను పెంచాం. ఇప్పటికే రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ఆదాయం లేక రైతులకు కుటుంబ పోషణ భారమవుతోంది. ఈ పరిస్థితిలో సొసైటీ రుణాలు తీర్చలేం. సొసైటీ అధికారులు మాత్రం ఇంటి చుట్టూ తిరిగి వేధిస్తున్నారు. కూలి పనులకు వలస పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

– యెనుముల నాగు, టీడీపీ సర్పంచ్‌, రైతు, కేశనపల్లి

నిధులు ఇవ్వకుంటే ఆందోళనే

రాజోలు దీవి అత్యంత ప్రమాదంలో ఉంది. కొబ్బరి పంట నాశనం అయ్యింది. రైతుల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. దీంతో కూలి పనులకు వెళ్లే స్థితిలో ఉన్నారు. కొబ్బరి కార్మికులకు పనులు లేవు. అయినా ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది. ముంపు సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలి. లేకుంటే ఆందోళన చేస్తాం.

– గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి

గట్ల నిర్మాణం జరగాలి

శంకరగుప్తం డ్రైన్‌కు డ్రెడ్జింగ్‌తో పాటు సమాంతరంగా గట్ల నిర్మాణం జరగాలి. అప్పుడే ముంపు సమస్య తీరి రైతుల సమస్య పరిష్కారం అవుతుంది. దీనికోసం అంచనాలు వేశారు. ఆర్థిక శాఖ వద్ద ఫైల్‌ ఉంది. కేబినెట్‌లో పెట్టాలని అధికారులు అంటున్నారు.

– ఎంవీవీ కిశోర్‌,

డ్రైన్స్‌ ఈఈ, కాకినాడ

కుంగదీస్తున్న కొబ్బరి పంట

పది వేల ఎకరాల్లో ఎండిపోయిన చెట్లు

20 వేల మంది రైతుల

పరిస్థితి తారుమారు

ఉప్పునీటి ప్రభావమే ప్రధాన కారణం

సమస్యలు చెట్టుముట్టాయి1
1/3

సమస్యలు చెట్టుముట్టాయి

సమస్యలు చెట్టుముట్టాయి2
2/3

సమస్యలు చెట్టుముట్టాయి

సమస్యలు చెట్టుముట్టాయి3
3/3

సమస్యలు చెట్టుముట్టాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement