
రెండు రోజులు భారీ వర్షాలు
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ మహేష్ కుమార్ సూచన
అమలాపురం రూరల్: వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ స్పందన సంస్థ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి వచ్చేలా చూడాలని, రానున్న రెండు రోజులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే బయటకు రావాలని, ఎటువంటి ప్రయాణాలు చేయరాదని అన్నారు. ప్రజల సహాయార్థం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08856 293104ను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. అలాగే డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని పాఠశాల భవనాల స్థితిగతులను పరిశీలించి, శిథిలావస్థలో ఉంటే అవసరమైతే ఇతర పాఠశాలకు విద్యార్థులను తరలించాలని అన్నారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ బి.రాజేశ్వరి ఆదేశించారు. 22 మండలాల అధికారులతో పాటు ఈఈలు, డీఈఈలు, ఏఈలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా తీగలు తెగిపోవడం, స్తంభాలు పడిపోవడం, లైన్లపై చెట్ల కొమ్మలు పడిపోవడం వంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఽవిజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ఫ్రీ నంబర్ 1912 లేదా కోనసీమ కంట్రోల్ రూమ్ 94409 04477కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.