
ఆ రెండు రోజులూ ఇబ్బందే!
సఖినేటిపల్లి– నరసాపురం రేవులో కిక్కిరిసిన జనంతో పంటు ప్రయాణం
● 18, 21 తేదీల్లో దిండి వంతెనపై
రాకపోకల నిషేధం
● ఇక పంట్లు, పడవలపైనే ప్రయాణం
● జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే
మలికిపురం: ఉభయ జిల్లాల మధ్య దిండి – చించినాడ వంతెనకు మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 18, 21 తేదీల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిషేధించారు. వంతెన బేరింగులు పాడవడంతో మరమ్మతుల్లో భాగంగా ఈ రెండు రోజులు బేరింగుల కొలతలు తీసుకునే పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం కాలినడకన వెళ్లేందుకు కూడా అనుమతి లేదు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ నిబంధన అమలులో ఉంటుంది. ఈ మేరకు ఉన్నతాధికారులు ప్రకటన జారీ చేశారు. ఇటుగా రాకపోకలు నిషేధించినట్లు ప్రకటించారే తప్ప ప్రయాణికులు పంట్లు, పడవలపై ఆధారపడితే పరిస్థితులు ఏంటనే ఆలోచన చేయలేదు. జాతీయ రహదారి కావడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఎలానూ సిద్ధాంతం వంతెన మీదుగా వెళ్తాయి. అయితే స్థానికులు రేవులనే ఆశ్రయించే అవకాశం ఉంది. కాగా సుమారు 23 ఏళ్లుగా అనేక మంది ప్రజలు ఈ వంతెనపై నుంచి రాకపోకలకు అలవాటు పడ్డారు. ఇక దగ్గర్లో మరో వంతెన లేదు. సాధారణ ప్రయాణికులతో పాటు, విద్యార్థులు, వ్యాపారులు ఈ రెండు రోజులూ కేవలం పంట్లు, పడవలపైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. కార్లు, బైక్‌లను సైతం పంట్లపైనే తీసుకెళ్లే అవకాశం ఉంది. జిల్లాలో వశిష్ట నదిపై సిద్ధాంతం తరువాత సుమారు 40 కిలోమీటర్ల దిగువన దిండి వద్దే వంతెన ఉంది. ఇక్కడ ఈ నదిపై పలుచోట్ల ఉన్న రేవుల్లో పంట్లు, పడవలపై రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం నదికి వరదల సమయం కావడంతో రేవుల్లో రెవెన్యూ శాఖ ఆంక్షలు కూడా ఉంటాయి. అయితే ఉభయ జిల్లాల్లో పెద్ద రేవుగా ఉన్న సఖినేటిపల్లి– నరసాపురం రేవులో పంట్లు ఉండడంతో ఇక్కడ ఈ రెండు రోజులు రద్దీ విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది. సోంపల్లి రేవు నుంచి పడవలపై మోటార్ సైకిళ్లను సైతం దాటిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితికి తగినట్లుగా ఈ రేవుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. పంట్లపై కిక్కిరిసి ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో ప్రమాదాలు సంభవించే అవకాశం లేకపోలేదు. అక్కడి పరిస్థితులపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాకపోకలకు అవకాశం లేదు
వంతెన బేరింగుల కొలతలు తీసేందుకు ఇంజినీర్లు వస్తున్నందున ఈ నెల 18, 21వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కాలినడకకు కూడా వంతెనపై అవకాశం లేదు. అత్యవసరమైతే సిద్ధాంతం వంతెన మీదుగా వెళ్లాల్సిందే. లేకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
–వెంకటరమణ, హైవే అథారిటీ ఇంజినీర్