
విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. అలా తిరుగుబాటు చేసిన ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక అమాంతంగా పెరిగిన విద్యుత్ బిల్లులకు తోడు స్మార్ట్ మీటర్లతో మరింత భారం పడుతుందన్నారు. వినియోగదారుడి అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించకూడదని సంబంధిత కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన నిబంధనల్లో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి విద్యుత్ శాఖ అధికారులు బలవంతంగా ఆదాని స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని ఆరోపించారు. తక్కువ వాడే విద్యుత్ వినియోగదారుడికి గతంలో రూ.వందల్లో బిల్లు వస్తే ఈ స్మార్ట్ మీటర్లు బిగించాక రూ.వేలల్లో వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. గతంలో విద్యుత్ బిల్లులు పెంచి కొన్ని పార్టీలు పతనానికి గురయ్యాయని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. నేడు అలాంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ స్మార్ట్ మోసాలపై త్వరలోనే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సమావేశాలు, డోర్ టూ డోర్ కాంపెయిన్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.
ఓటు హక్కును హరించిన ‘కూటమి’
కడప జిల్లా పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోలీసు తుపాకీలతో ఓటు హరించేలా చేసిందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అన్నారు. ఓటు హక్కును లేకుండా చేయడం అంటే ప్రజాస్వామానికి తూట్లు పొడిచినట్లేనని చెప్పారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య ద్రోహమేనన్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లే లేకుండా, ఓటర్లకు ఓటును వినియోగించుకునే అవకాశమే ఇవ్వకుండా గెలిచిన గెలుపు అసలు గెలుపే కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, ఉమ్మడి జిల్లా పార్టీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, నాయకులు ముంగర ప్రసాద్, దండుమేను రూపేష్, కుడుపూడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.