మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి : సీపీఎం
అమలాపురం టౌన్: ఇసుక మాఫియా ఆక్రమ తవ్వకాల వల్లే కమిని లంక గ్రామంలో గోదావరి పాయలో 8 మంది యువకులు గల్లంతై మృత్యువాత పడే దుస్థితి దాపురించిందని సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ యువకుల చావులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా సీపీఎం నాయకులు బృందం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని మంగళవారం సందర్శించింది.
ఈ మేరకు సీపీఎం జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు అమలాపురంలో మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇసుక మాఫియా ఆగడాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. 8 మంది యువకులు గోదావరిలోకి స్నానాలకు వెళ్లి మృతి చెందారంటే ముమ్మూటికీ ఇసుక మాఫియా అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన అంచనా తెలియని లోతుతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది.
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
అమలాపురం టౌన్: గత ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జనరల్, ఒకేషనల్ పరీక్షలు బుధవారం నుంచి జూన్ 1వ తేదీ వరకూ జరుగుతాయని డీఐఈవో వనము సోమశేఖరరావు తెలిపారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకూ ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మరో పరీక్ష నిర్వహిస్తారని ప్రకటనలో తెలిపారు.
నిధుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలి
అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు జెడ్పీటీలకు తెలియకుండా ఎన్‌ఆర్‌జీఎస్ జెడ్పీ నిధులు కేటాస్తున్నారు, ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ కోనసీమ జిల్లా చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు కలెక్టర్ వద్ద ఆవేదన వెలిబుచ్చారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో వారు మంగళవారం కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, జెడ్పీ విడుదల చేసే 15 శాతం నిధులు, ఆర్‌డబ్ల్యూఎస్ పనుల్లో కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని వివరించారు. ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపించడం లేదని తెలిపారు. ప్రత్యక్షంగా ఎన్నికై న తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎలా అని అన్నారు. తమ జెడ్పీ నిధులు కూడా తమకు తెలియకుండా ఎమ్మెల్యేలు చెప్పిన పనులకు ఎంపీడీవోలు, అధికారులు ఆమోదం తెలుపుతున్నారని అన్నారు. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నిధుల కేటాయింపులో జెడ్పీటీసీ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జెడ్పీటీసీ సభ్యులు పందిరి రామ్‌గోపాల్, గెడ్డం సంపతిరావు, కోనుకు గౌతమి, మట్టా శైలజ, కసిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, కూడుపూడి శ్రీనివాస్, కూడుపూడి భారతి, వి.వీర వెంకట సూర్యనారాయణ (అబ్బు), బోణం సాయిబాబా కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డు ఏర్పాటు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కోవిడ్ వ్యాిప్తి నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమవుతున్నారు. ముందు జాగ్రత్తగా రాజమహేంద్రరం ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలతో కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. ఈ వార్డులో ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశారు. వెంటిలేటర్‌ను అందుబాటులో ఉంచారు. రోగులకు వ్యాధి లక్షణాలను బట్టి అవసరమైతే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. పూర్వపు క్యాంటీన్ ప్రాంతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ చర్యలు చేపట్టారు.