అసలే జాప్యం.. ఆపై గోప్యం
రాయవరం: మూగజీవాల గణన జిల్లాలో గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన గణన ఏడాది ఆలస్యంగా ప్రారంభించారు. అసలే ఆలస్యంగా గణన ప్రారంభించి పూర్తి చేసినా దాని వివరాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. ఆ వివరాలను వెల్లడిస్తేనే బడ్జెట్, పశువులకు అవసరమయ్యే వ్యాక్సిన్లు, మందులు, పథకాలు రూపొందించే అవకాశముంటుంది. 21వ జాతీయ పశుగణనను పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పశుగణనను ఐదున్నర నెలల పాటు సిబ్బంది చేపట్టారు. 19వ జాతీయ పశుగణన 2014లో, 20వ పశుగణన 2019లో నిర్వహించారు.
340 మంది సిబ్బందితో..
పక్కాగా పశుగణన చేపట్టేందుకు జిల్లావ్యాప్తంగా 286 మంది ఎన్యూమరేటర్లు, 54 మంది సూపర్‌వైజర్లను నియమించారు. జిల్లా వ్యాప్తంగా 425 రెవెన్యూ గ్రామాలు, వార్డులను 286 మంది ఎన్యూమరేటర్లు గణన చేశారు. ప్రతి రెవెన్యూ విలేజ్‌కు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. పశుగణనలో భాగంగా గ్రామాల్లో ప్రతి నివాసాన్ని ఎన్యూమరేటర్ సందర్శించి, గేదెలు, ఆవులు, వాటి జాతులు, కోళ్లు, వాటి రకాలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు తదితర పశు జాతులను నమోదు చేశారు. ఈసారి ఎన్యూమరేటర్ ఫోన్‌లోనే యాప్ ద్వారా ఎన్యూమరేషన్ చేపట్టారు.
పెరిగిన కుటుంబాలు
2019లో 4,83,292 కుటుంబాలను గణన చేశారు. ఈసారి ఫిబ్రవరి 25వ తేదీ నాటికి 5,56,295 కుటుంబాల గణన చేపట్టారు. ప్రతి గ్రామంలో ఆవుల్లో ఒంగోలు, పుంగనూరు, సాహివాల్, గిర్, జెర్సీ, హెచ్‌ఎఫ్ సంకరజాతి, గేదెల్లో ముర్రా, గ్రేడెడ్ ముర్రా, కోళ్లలో టర్కీ, నాటు, కముజు పిట్టలు, ఫారం కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, కుక్కలు, పెరటికోళ్లు, బాతులు, సేద్యపు ఎద్దులు ఇలా వేర్వేరుగా నమోదు చేశారు. పశు సంపదతో పాటు ఆ గ్రామంలో పశువైద్యశాల ఉందా? లేదా? పాలసేకరణ కేంద్రం, పశుగ్రాస క్షేత్రాలు ఉన్నయా? లేదా? పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారా? లేక సొంతంగా చేపడుతున్నారా? తదితర విషయాలను నమోదు చేశారు. పశు యజమాని అక్షరాస్యుడా? నిరక్షరాస్యుడా? పశు సంపద ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? పశువుల షెడ్డు ఉందా? ఆరుబయట పశువులను కడుతున్నారా? గొర్రెల సొసైటీలు ఉన్నాయా? పశు వధశాల ఉందా? పశువుల సంరక్షణలో పురుషలు/సీ్త్రలు ఎవరు ఎక్కువ సంరక్షణ చేస్తున్నారు? తదితర విషయాలను కూడా పశు గణకులు సేకరించారు.
త్వరలో వెల్లడయ్యే అవకాశం
21వ జాతీయ పశుగణన జిల్లాలో పూర్తి చేశారు. పశుగణనలో మూగజీవాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి గణనలో గుర్తించిన మూగజీవాల వివరాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ 15న ముగిసిన జాతీయ పశుగణన వివరాలను వెల్లడిస్తే దాని ప్రకారం పశువుల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్, పశువులకు అవసరమయ్యే వ్యాక్సిన్లు, మందులు, పథకాలు రూపొందించే అవకాశముంటుంది. దేశవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
జిల్లాలో ఉన్న మూగజీవాలు
19వ జాతీయ 20వ జాతీయ
పశు గణన పశు గణన
ఆవులు 3,77,257 2,26,740
గేదెలు 6,43,948 6,29,662
గొర్రెలు 2,47,670 3,37,603
మేకలు 2,94,054 1,94,653
పందులు 32,723 39197
పౌల్ట్రీ, 2,83,37,640 3,06,24,292
నాటు కోళ్లు
జిల్లాలో పూర్తయిన జాతీయ పశుగణన
ఇంకా లెక్కలు
వెల్లడించని కేంద్ర ప్రభుత్వం


