ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ | - | Sakshi
Sakshi News home page

ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ

May 9 2025 12:06 AM | Updated on May 9 2025 12:06 AM

ప్రథమ

ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ

అగ్ని ప్రమాదాల బారిన పడితే..

గ్రామాల్లో ముఖ్యంగా పశువులు పాకలు అగ్ని ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఆ సమయంలో పశువుల పాకల్లో ఉన్న గేదెలు, ఆవులు ప్రమాదంలో చిక్కుకుని కాలిపోతాయి. పశువుల కొట్టాం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ముందుగా పలుపుతాళ్లు కోసి పశువులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కాలిన గాయాలపై తరచు చన్నీళ్లు పోయాలి. వీలైతే పశువును చెరువులోనికి దింపి శరీరం పూర్తిగా తడిసేలా చేయాలి. పశువులను అరటి ఆకులపై పడుకొనేలా చూడాలి. పశువులకు అయిన గాయాలపై వరిపిండిలో ఏక్రిఫ్లేవిన్‌ పౌడర్‌ను వరిపిండి, కొబ్బరినూనె కలిపి పూయాలి. నడవలేని స్థితిలో ఉంటే పశువెద్యుడిని ఘటనా స్థలికి తీసుకుని వచ్చి వైద్యం చేయించాలి.

రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లోని పశువులు తోటలు, పొలాల్లోకి మేతకు వెళ్తుంటాయి. చెట్టుచేమల్లో గడ్డిని మేసే సమయంలో ఒక్కొక్కసారి విష పురుగులు, విద్యుత్‌ ప్రమాదాల బారిన పడుతుంటాయి. పశువులు ప్రమాదాల్లో చిక్కుకున్న సమయంలో పాడిరైతులు ఆందోళన చెందకుండా వెంటనే ప్రథమ చికిత్స అందిస్తే పశువులను ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చునంటున్నారు రాయవరం మండల పశువైద్యాధికారి ఎ.నాగశ్రావణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

పాముకాటుకు గురైతే..

పశువులు పాముకాటుకు గురైతే విషం రక్తనాళాల ద్వారా శరీరమంతా వ్యాపించి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి పశువులు వెంటనే మరణించే అవకాశం ఉంది. పాముకాటు వేసినచోట ఎర్రగా మారి వాపు వస్తుంది. రెండు గాట్లు వెంబడి రక్తం వస్తుంది. పశువులు కింద పడిపోవడం, నోటి నుంచి చొంగ రావడం, కళ్లు తేలేయడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.

చికిత్స ఇలా..

అటువంటి సమయంలో పాముకాటు గుర్తించిన చోట రక్తం బయటకు వచ్చేలా గట్టిగా నొక్కాలి. అందుబాటులో టించర్‌ అయోడిన్‌ ఉంటే పాముకాటు వేసిన చోట పూయాలి. విషం పశువు శరీరంలోనికి ప్రవేశించకుండా పై భాగంలో తాడు/గుడ్డతో గట్టిగా కట్టాలి. ఆ తర్వాత పశువైద్యుడిని సంప్రదించి యాంటివీనమ్‌ టీకా వేయించాలి. పశువులను బాగా గాలి సోకే ప్రదేశంలో ఉంచాలి. శ్వాస బాగా ఆడేలా చూసుకోవాలి.

విద్యుదాఘాతానికి గురైతే..

పశువులు విద్యుదాఘాతానికి గురైతే కొన్నిసార్లు వెంటనే మరణిస్తాయి. ఓల్టేజీ తక్కువగా ఉండి షాక్‌కు గురైతే శరీరంపై కాలిన మచ్చలు వస్తాయి. విద్యుదాఘాతానికి గురైన సమయంలో గిలగిలా కొట్టుకుని స్పృహ కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా గురవుతాయి. ముట్టుకుంటే అతిగా స్పందిస్తాయి. ఇలాంటి సమయంలో పశువులను నేరుగా తాకరాదు. విద్యుత్‌ నిలిపివేసిన తర్వాతనే పశువును ముట్టుకోవాలి. ప్రాణం ఉందని గుర్తించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

విషాహారం తింటే..

పంటను ఆశించే చీడపీడల నివారణకు రైతులు విషపూరితమైన రసాయనిక ఎరువులను పిచికారీ చేస్తారు. అనుకోకుండా పశువులు వాటిని తినడం వలన శరీరంలోనికి విషం ప్రవేశిస్తుంది. దీనివల్ల కళ్లు తేలేయడం, నోటి వెంట చొంగ కారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇలాంటి సమయంలో పశువుకు కలప బొగ్గుపొడి కలిపిన నీటిని తాగించాలి. అది విష పదార్థాలను కొంత వరకు పీల్చుకుని పశువుకు హాని కలగకుండా చేస్తుంది. అలాగే వంట నూనె అరలీటరు, పది కోడిగుడ్ల తెల్లసొనను పశువులకు తాగించాలి. అనంతరం మెరుగైన వైద్యం కోసం పశువైద్యుడిని సంప్రదించాలి.

పశువులు ప్రమాదంలో

చిక్కుకుంటే ఆందోళన చెందవద్దు

ప్రథమ చికిత్స అందించి

వైద్యులను సంప్రదించాలి

ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ 1
1/2

ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ

ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ 2
2/2

ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement