రైతు పండించిన ప్రతి గింజా కొనాల్సిందే
● లక్ష్యం పూర్తయ్యిందంటే ఎలా!
● కూటమి ప్రభుత్వ విధానం సరికాదు
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
మండపేట: రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అవలంబించిన తీరుతో మండపేట రైతులు రోడ్కెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. మండలంలోని కేశవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో స్థానిక రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఎమ్మెల్సీ తోట స్పందించారు. విజయలక్ష్మి నగర్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. పది రోజుల క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ గ్రామానికి వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారని తెలిపారు. ఆ కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తీసుకువెళుతుంటే తమకిచ్చిన టార్గెట్ పూర్తయిపోయిందని ఆర్‌ఎస్‌కే సిబ్బంది చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనకపోతే, ఇంకెవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. రైతులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం ప్రకటించిన మధ్ధతు ధరకు ధాన్యాన్ని కొనితీరాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ధర్నా నేపథ్యంలో తహసీల్దార్ వచ్చి ధాన్యాన్ని కొనేలా చర్యలు తీసుకుంటామన్నారని తెలిసిందని, తాను రెండ్రోజులు చూస్తానని, అలా కాని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.


