ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదంపై.. భగ్గుమన్న మాల మహాన
అమలాపురం టౌన్: ఎస్సీ వర్గీకరణను, తప్పుల తడకలా ఉన్న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించడంపై జిల్లా మాల మహానాడు అమలాపురంలో సోమవారం రాత్రి భగ్గుమంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న టీడీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అసెంబీలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తమతో ఫోన్‌లో మాట్లాడితే కానీ ముట్టడి విరమించబోమని భీష్మించి కూర్చున్నారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్, రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు జల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. ఎస్సీ వర్గీకకరణను, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఆమోదించిన కేబినెట్ తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మాలలపై కక్ష కట్టిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలపై వ్యతిరేక ధోరణిలో ఉన్నారని ఆరోపించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రద్దు చేసి, హైకోర్టు జడ్జీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఫోన్‌లో మాట్లాడాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. గంటకు పైగా టీడీపీ కార్యాలయ ముట్టడి కొనసాగుతుండగా, అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్ ఆందోళనకారులతో చర్చించారు. ఎమ్మెల్యే అమరావతిలో బిజీగా ఉండడం వల్ల ఫోన్ మాట్లాడలేకపోతున్నారని సీఐలు వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఎమ్మెల్యే అమలాపురం వచ్చాక ఆయా డిమాండ్లపై మాట్లాడాలని సూచించారు. చివరకు ఆందోళనకారులు ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రాన్ని అందించి ఆందోళనను విరమించారు. మాల మాహానాడు నేతలు పెయ్యల పరశురాముడు, కుంచే బాబులు, గిడ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అమలాపురంలో టీడీపీ కార్యాలయం ముట్టడి
సీఎం, డిప్యూటీ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు


