రాజమండ్రిలో సీన్ తీస్తే సూపర్ హిట్టే
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని అది హిట్టని అన్నారు. ఆ సెంటిమెంటుతో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్, శ్రీ లీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈనెల 28 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర ప్రమోషషన్ కోసం రాజమండ్రి వచ్చిన చిత్ర బృందం శనివారం మధ్యాహ్నం మంజీరా హోటల్‌లో మీడియాతో మాట్లాడింది. నితిన్ మాట్లాడుతూ దర్శకుడు వెంకీ కుడుముల తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోందని సినిమా కూడా హిట్టవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. నితిన్ యాక్షన్ సీన్లు, ఫన్ అందరినీ అలరిస్తాయని, సినిమాలో సర్ప్‌రైజ్ ట్విస్టులు కూడా ఉన్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మంచి పాటలు కంపోజ్ చేశారని చెప్పారు. శ్రీలీల గత చిత్రాలలో ఆమె డ్యాన్స్ మాత్రమే చూశారని, ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ కూడా చూస్తారని వెంకీ తెలిపారు. శ్రీలీల మాట్లాడుతూ తనకు రాజమండ్రి కొత్తకాదని తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. ఈ సినిమాలో పాత్ర తనకు చాలా నచ్చినదని, ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని, పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలని ఆమె కోరారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తనకు చాలా ఇష్టమని ఆమె అన్నారు.
రాబిన్‌హుడ్ ప్రేక్షకులకు నచ్చుతుంది
హీరో నితిన్


