అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారిగా నక్కా వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొరకు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను ఆయన చాంబర్‌లో మంగళవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇంటర్ పరీక్షకు 907 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 907 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు మొత్తం 11,984 మంది హాజరు కావాల్సి ఉండగా 11,462 మంది హాజరయ్యారు. 522 మంది రాలేదు. ఒకేషనల్ పరీక్షలకు మొత్తం 2,676 మందికి 2,291 మంది హాజరయ్యారు. 385 మంది రాలేదు. జిల్లాలోని 40 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు.
విద్యార్థులలో సృజనను వెలికితీయాలి
ముమ్మిడివరం: విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా పిలుపునిచ్చారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంలో ప్రావీణ్యం ఉంటుందని అది వెలికి తీసే విధంగా బోధన ఉండాలన్నారు. బోధనా సిబ్బందితో పాటుగా బోధనేతర సిబ్బంది విధుల పట్ల అంకిత భావంతో పనిచేయడం ద్వారా జిల్లాను విద్యాపరంగా మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఫైనాన్స్ అకౌంట్స్ అధికారి జి.ప్రవీణ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రమణ్యం, ఐఈ కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, ఏఎంవో రాంబాబు పాల్గొన్నారు.
27 మందికి
ఉద్యోగావకాశాలు
ముమ్మిడివరం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాఽధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాలో 27 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు తెలిపారు. రెండు ప్రధాన కంపెనీలు పాల్గొన్న ఈ జాబ్ మేళాకు 52 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకాగా 27 మందిని ఎంపిక చేశారు. స్కిల్ హబ్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఎస్‌ఈడీఏపీ సిబ్బంది పాల్గొన్నారు.
హై వే పనులు వేగవంతం చేయాలి
అమలాపురం టౌన్: అమలాపురం– రావులపాలెం జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డికి మంగళవారం లేఖ రాశారు. అమలాపురం ఎర్ర వంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెనలను జిల్లా కేంద్రం అయ్యాక పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా ఆధునీకరించాలని సూచించారు. అమలాపురం– రావులపాలెం జాతీయ రహదారి జిల్లా ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్న దృష్ట్యా ఆ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్యయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి అనుసంధానిస్తే కోనసీమ ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. అమలాపురం పట్టణంలో ఆ మూడు వంతెనలు దాదాపు శిథిలావస్థకు చేరుకుని ట్రాఫిక్ అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు వంతెనలపై నిత్యం ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా మలేరియా అధికారిగా వెంకటేశ్వరరావు


