వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

YSRCP Leader Attacked With Tractor By Rivals In YSR Kadapa District - Sakshi

ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ప్రత్యర్థులు

తీవ్రంగా గాయపడిన బయారెడ్డి పరిస్థితి విషమం

గాలివీడు: వైఎస్సార్‌ జిల్లా గాలివీడు మండలం తూముకుంట పంచాయతీ పరిధిలోని మరికుంటపల్లెకు చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కుడుముల బయారెడ్డిపై ప్రత్యర్థి వర్గీయులు సోమవారం హత్యాయత్నం చేశారు. పొలం వెళుతున్న బయారెడ్డిని ప్రత్యర్థులు ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన బయారెడ్డి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పరుగున అక్కడకు వచ్చారు. గమనించిన ప్రత్యర్థులు అక్కడినుంచి పారిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి గాయపడిన బయారెడ్డిని రాయచోటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వేలూరుకు తరలించారు. 

రౌడీషీటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు
ఈ హత్యాయత్నానికి సంబంధించి బయారెడ్డి కుమార్తె లావణ్య ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు గాలివీడు ఎస్‌ఐ ఇనాయతుల్లా తెలిపారు. భూతగాదాలు, రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే తమ తండ్రిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామానికి చెందిన రౌడీషీటర్‌ ఈశ్వరరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, భూషణ్‌రెడ్డిల ప్రమేయం ఉందని తెలిపారు. దీంతో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఈ హత్యాయత్నం విషయం తెలిసిన వెంటనే లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సీఐ విలేకరులతో మాట్లాడుతూ నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బయారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరా తీశారు. ఫోన్‌లో బయారెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top