అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్‌ 

AP Government Serious On Guntur Lovers Attack Incident - Sakshi

సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్‌/గుంటూరు ఈస్ట్‌: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్‌ మండలం సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి నర్సింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. డీజీపీ డి.గౌతం సవాంగ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు  ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే పోలీస్‌ శాఖ ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్‌ స్పందిస్తూ.. అత్యాచారం చేసినవారు ఎంతటి వారైనా గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఇటువంటి అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 

నిందితులకు కఠిన శిక్ష తప్పదు 
కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అనేక చట్టాలు చేస్తున్నా ఉన్మాదులు బరి తెగిస్తున్నారన్నారు. పుష్కర ఘాట్‌లో నిఘా పెంచుతున్నామని, అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తానేటి వనిత మాట్లాడుతూ బాధితురాలిని పరామర్శించి భరోసా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమను పంపించారని తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఆదేశించారన్నారు. తమ శాఖ నుంచి రూ.50 వేలు ఇస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా.. బాధితురాలిని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

కేసు దర్యాప్తులో పురోగతి 
ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. సోమవారం తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్, అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు కలిసి కొంతమంది అనుమానితులను విచారించారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించామని చెప్పారు. తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం వచ్చిందని, ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసేంతవరకు వివరాలు వెల్లడించబోమని పేర్కొన్నారు. మరో 24 గంటల్లో కేసును పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు.

కృష్ణా తీరంలో గతంలోనే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, 19న పోలీసులందరూ హడావుడిగా ఉండటంతో అక్కడ ఆ రోజు నిఘా కొరవడిందన్నారు. గత 15 రోజుల వ్యవధిలో కృష్ణా తీరంలో మద్యం, గంజాయి సేవిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని చెప్పారు. పుష్కర ఘాట్‌లోకి రాత్రి 9 గంటల తరువాత ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైనది కావడం, కృష్ణా నదిపై మూడు రైల్వే బ్రిడ్జిలు ఉండటం, నిర్జన ప్రదేశం కావడంతో అసాంఘిక శక్తుల కదలికలు ఎక్కువయ్యాయన్నారు. వారిని నివారించేందుకు రైల్వే పోలీసులతో సంయుక్త కార్యాచరణ రూపొందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మహిళలు, యువతుల భద్రతకు సీఎం ఆదేశాలు 
నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం ఘటన కేసులో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను గుర్తించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. దిశ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిందితులను గుర్తించి శిక్ష పడేట్టుగా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని, ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నది పరిసరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నానని.. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్‌ చేస్తామని డీజీపీ చెప్పారు.  

పాత నేరస్తుల పనేనా! 
పోలీసులు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులూ తాడేపల్లి ప్రాంతానికి చెందిన వారేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులు బ్రిడ్జి వద్ద రైళ్లు ఆగి.. బయలుదేరే సమయంలో ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లు, మెడలో చైన్‌లు లాక్కొని పరారయ్యే బృందంగా తెలియవచ్చింది. ఇందులో ఓ యువకుడికి పడవ నడిపే అనుభవం ఉంది. మరో యువకుడు రెండేళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడని సమాచారం. పడవ నడిపే అనుభవం ఉన్న వ్యక్తి బందరు బీచ్‌లో ప్రేమ జంటపై దాడి చేయగా అక్కడ కూడా కేసు నమోదైనట్టు చెబుతున్నారు. 

చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top