అమ్మా.. నాన్నా.. నేనూ మీ దగ్గరికే వచ్చేస్తున్నా...  

Young Man Commits Suicide In Krishna District Kaikaluru - Sakshi

కైకలూరు: తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిన ఓ యువకుడికి అమ్మమ్మ ఆధారంగా మిగిలింది. ఆమె కూడా కన్నుమూయడంతో తట్టుకోలేని అతను మనస్థాపంతో ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ హృదయ విదారకర ఘటన వివరాలిలా ఉన్నాయి. గుడివాడకు చెందిన చిన్ని నవీన్‌ (24) అక్కడ ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తున్నాడు. తండ్రి సుమారు 20 ఏళ్ల క్రిందట మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి 9 నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. దీంతో అమ్మమ్మ, మేనమామ వద్ద ఉంటున్నాడు.

వయసు రీత్యా సమస్యలతో అమ్మమ్మ 3 నెలల క్రితం మృతి చెందింది. దీంతో నా అనే వారు ఎవరూ లేరు.. అనే భావనతో కొద్ది రోజులుగా నవీన్‌ ముభావంగా ఉంటున్నాడు. చివరకు మనస్థాపంతో ద్విచక్రవాహనంపై కైకలూరు మండలం ఉప్పుటేరు బ్రిడ్జికి బుధవారం రాత్రి వచ్చాడు. చివరి సారిగా మేనమామకు ఫోన్‌ చేసి నేను కూడా మా అమ్మానాన్న దగ్గరకు వెళ్లిపోతున్నాను.. ఇక నన్ను మర్చిపోండి.. అంటూ సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉప్పుటేరులో దూకేశాడు.

గుడివాడ నుంచి హుటాహుటిన వచ్చిన మేనమామ పోలీసుల సాయంతో వెతకగా ఉప్పుటేరు వద్ద నవీన్‌ బైక్‌ కనిపించింది. గాలింపు చర్యలు చేయగా గురువారం రాత్రి ననీన్‌ మృతదేహం లభించింది. మేనమామ సన్నిది మంగరాజు ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ చల్లా కృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయినవాళ్ళను కోల్పోయి నిండు జీవితాన్ని వదిలిపెట్టిన నవీన్‌ మృతి అందరిని కంటతడి పెట్టించింది. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top