
సాక్షి, ఆమదాలవలస: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పచ్చ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వారే అధికారంలో ఉన్నారనే కారణంగా పలు అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆమె గర్భవతి కాగా.. బెదిరింపులకు దిగాడు.
టీడీపీ కార్యకర్త ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఈ దారుణ ఘటనపై ఎస్‌ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. కోటిపల్లి రాజు అనే యువకుడు 9వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలిక గర్భిణి అని తేలడంతో బాధితురాలి తల్లి ఆదివారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అయితే, తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై యువకుడిని ప్రశ్నించగా తాను టీడీపీ కార్యకర్తనని, తనకు పార్టీ నేతల అండదండలున్నాయంటూ బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.