బకాయిలు తీర్చరూ..! | - | Sakshi
Sakshi News home page

బకాయిలు తీర్చరూ..!

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

బకాయి

బకాయిలు తీర్చరూ..!

● బడాయిల సర్కారు..

అరసవల్లి:

చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరోగ్య శ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బకాయిలు పేరుకుపోవడం, రోగులు ఇబ్బంది పడడం, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వారు ఆందోళనలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.80 కోట్ల వరకు బకాయిలు పెట్టేసినట్టు తేలింది. ఏప్రిల్‌ నుంచి కొత్త యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆరోగ్య శ్రీ అమలు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దీనిపైనే ఆధారపడి ఉన్న వైద్యమిత్రల భవిష్యత్‌ కూడా అయోమయంలో పడింది.

దాదాపు రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది పేద, సామాన్య వర్గ రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు, ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ పథకం అచ్చంగా వైఎస్సార్‌ మానస పుత్రిక. ఈ పథకం కింద స్వస్థత పొందిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌ గుర్తుకు వస్తారు. కానీ అది చంద్రబాబు ప్రభుత్వానికి గిట్టడం లేదు. ఎలాగైనా ఆ పేరును జనం మనసులోంచి తొలగించాలని ఈ పథకానికి ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరు మార్చారు. అంతటితో ఆగకుండా త్వరలో యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీని తీసుకురానున్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం చర్య లు మొదలుపెట్టింది. రానున్న ఏప్రిల్‌ నుంచే ఈ ఇన్సూరెన్స్‌ స్కీం వర్తించేలా మార్గదర్శకాల విడు దలకు సన్నాహాలు చేస్తోంది. ఈ తరుణంలో ఇప్పటివరకు పలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ క్రింద చెల్లింపులు బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. అలాగే ఈ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ వైద్యమిత్రల ఉద్యోగ భవితవ్యం కూడా ఆందోళనలో పడేసింది.

ఆందోళనలో వైద్యమిత్రలు

జిల్లాలో 6,39,427 ఎన్టీఆర్‌ వైద్యసేవ హెల్త్‌ కార్డుదారులున్నాయి. మొత్తం 40 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈ మేరకు ఈ పథకం కింద ప్రొసీజర్లను అమలు చేస్తున్నారు. వీటిలో టెక్కలి జిల్లా ఆస్పత్రి, నరసన్నపేట ఏరియా ఆస్పత్రి, 13 కమ్యూనిటీ ఆస్పత్రులు, శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రి, రిమ్స్‌ మెడికల్‌ కాలేజి ఆస్పత్రిలతో పాటు మరో 23 ప్రైవేటు ఆస్పత్రులు, కార్పోరేట్‌ ఆస్పత్రులున్నా యి. వీటిల్లో సుమారు 87 మంది వైద్యమిత్రలు గత రెండు దశాబ్దాల నుంచి రోగులకు సలహాలు, సూచనలతో పాటు పథకం అమలుకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వైద్యమిత్రల ఉపాధి ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడు ఏకంగా పథకాన్ని నిర్వీర్యం చేస్తే వీరి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పేరుకుపోయిన రూ.80 కోట్ల బకాయిలు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక వ్యూహం ప్రకా రం ఆరోగ్యశ్రీ పథకాన్ని మంగళం పాడించేలా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా ఆయా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన నిధులను బకాయిలుగా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సు మారు రూ.2,800 కోట్ల వరకు బకాయిలుండడంతో ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ఆధ్వర్యంలో గత ఏడాది ఏప్రిల్‌, సెప్టెంబర్‌ నెలల్లో రెండు సార్లు నిరసనలకు దిగి ఏకంగా 20 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సర్వీసులను నిలిపివేశారు. అలాగే ఈహెచ్‌ఎస్‌ సేవలను కూడా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం చర్చలు జరిపి కొంత మొ త్తాన్ని నిధులను విడుదల చేయడంతో సర్వీసులు ఆయా ప్రైవేటు ఆస్పత్రుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇంకా జిల్లాలో 13 నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సుమారుగా రూ.80 కోట్ల వరకు నిధులు చెల్లించాల్సి ఉంది.

ఓ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్యసేవల కియోస్క్‌లో పనిచేస్తున్న వైద్యమిత్ర

గోప్యంగా ఆదేశాలు

ఆరోగ్యశ్రీ పేరును పూర్తిగా తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీని తీసుకొస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జీఓ నంబర్‌ 162 ను మాత్రమే విడుదల చేసి, పాలసీకి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను బయటపెట్టలేదు. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఆపై మొత్తాన్ని ఇన్స్యూరెన్స్‌ కంపెనీల ద్వారా చికిత్స అందించాలనే ప్రతిపాదనపై అధికారులకు శిక్షణను ఇటీవల ఇచ్చారు. ఇప్పటికే ఆస్పత్రుల సిబ్బంది వివరాలు రిజిస్టర్‌ చేశారు. అయితే తక్కువ ప్యాకేజిల కారణంగా ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు ముందుకు రావడం లేదని సమాచారం.

బకాయిలు తీర్చరూ..! 1
1/1

బకాయిలు తీర్చరూ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement