వార్డు మెంబర్‌ బాగోతం.. 72 గుంటల స్థలాన్ని ఆన్‌లైన్‌ చేయిస్తానని..

Word Member Fraud In Adilabad - Sakshi

సాక్షి, కోరుట్ల(ఆదిలాబాద్‌): నమ్మితే.. వృద్ధుడిని మోసగించిన ఓ వార్డు మెంబర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు కథనం ప్రకారం.. కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన అగ్గ ఆశన్న(60)కు 3.24 ఎకరాల భూమి ఉంది. ఇందులో కేవలం 72 గుంటలకు మాత్రమే అతని పేరిట ధరణిలో ఆన్‌లైన్‌ అయ్యింది. దీంతో మిగతా భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు అదే గ్రామానికి చెందిన వార్డు మెంబర్‌ పాశం విజయ్‌కుమార్‌ను కలిశాడు.

ధరణిపై ఆశన్నకు అవగాహన లేని విషయాన్ని గ్రహించిన అతను తాను సాదాబైనామా కింద 72 గుంటల స్థలాన్ని ఆన్‌లైన్‌ చేయిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బందికి, తహసీల్దార్‌కు లంచాలు ఇవ్వాలని పలు దఫాలుగా రూ.4.30 లక్షలు వసూలు చేశాడు. గత ఫిబ్రవరి 18న సాదాబైనామాతో 72 గుంటల భూమిని ఆన్‌లైన్‌ చేస్తారని తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టాలని ఆశన్నకు చెప్పాడు. విజయ్‌కుమార్‌ మాటలు నమ్మిన ఆయన అడిగిన చోట సంతకాలు పెట్టి, అప్పటినుంచి తన భూమి ఆన్‌లైన్‌లో వస్తుందని ఎదురుచూశాడు.

కానీ ఆన్‌లైన్‌లో భూమి వివరాలు రాకపోగా ఇదివరకే పట్టా ఉండి, ఆన్‌లైన్‌లో ఉన్న 72 గుంటల భూమిని ఆశన్న నుంచి పాశం విజయ్‌కుమార్‌ కొనుగోలు చేసినట్లుగా నమోదవడంతో ఆందోళనకు గురయ్యాడు. తనకు జరిగిన మోసాన్ని గుర్తించి, వెంటనే తహసీల్దార్‌ సత్యనారాయణకు, కోరుట్ల రాజశేఖర్‌రాజుకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ దర్యాప్తు చేయాలని ఎస్సై రాజప్రమీలకు ఆదేశించారు. పోలీసుల విచారణలో విజయ్‌కుమార్‌ రెవెన్యూ అధికారుల పేరిట డబ్బులు దండుకోవడమే కాకుండా ఆశన్న భూమిని తన పేరిట మార్చుకున్నట్లు తేలింది.

విజయ్‌కుమార్‌ గతంలో పైడిమడుగులో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని సీఐ తెలిపారు. ఆశన్న ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది దళారులు భూములను ఆన్‌లైన్‌ చేయిస్తామని డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిజమని తేలితే నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కలెక్టర్‌ స్పందించి, భూమిని మళ్లీ తన పేరిట మార్పించి, ఆదుకోవాలని బాధితుడు ఆశన్న వేడుకుంటున్నాడు. 

     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top