Extramarital Affair: బరి తెగించిన భార్య.. ‘మా ఆయన్ను లేకుండా చేస్తే మనకు అడ్డుండదు’

Wife Conspired To Kill Her Husband With Her Boyfriend In Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌: ‘మనది స్వచ్ఛమైన ప్రేమ. దీన్ని గెలవాలంటే మా ఆయన్ను తప్పించాలి. ఆయన్ను చంపేస్తే మనం హాయిగా కలిసి ఉండొచ్చు...’ అని ప్రియురాలు చెప్పిన మాటల్ని తలకెక్కించుకున్న ప్రియుడు ఆమె భర్తను స్నేహితులసాయంతో హతమార్చాడు. తీరా పోలీసులకు పట్టుబడి జైలుపాలయ్యాడు. గతవారం చిత్తూరు శివారుల్లో వెలుగుచూసిన ఆటోడ్రైవర్‌ వడివేలు హత్య కేసు మిస్టరీని తాలూక పోలీసులు ఛేదించారు.

ఈ కేసులో ఎ.సెల్విరాణి (26), ఎస్‌.వినయ్‌ (30), ఆర్‌.నిరంజన్‌ (30), ఎం.కిషోర్‌ (29) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తాలూక స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసమూర్తి.. సీఐ మద్దయ్య ఆచారి, ఎస్‌ఐ రామకృష్ణతో కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు బాలాజీనగర్‌ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ వడివేలు  ఈనెల 5వ తేదీ రాత్రి సీతమ్స్‌ బైపాస్‌ వద్ద హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి రాణెమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్విరాణి గత ఏడాదిగా నగరంలోని చర్చివీధిలో ఓ బిందెల దుకాణంలో పనిచేస్తోంది.

ఇదే వీధిలో ఎంబీఏ వరకు చదువుకుని ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్న వినయ్‌తో ఈమె తనకు పెళ్లికాలేదంటూ పరిచయం చేసుకుంది. ఏడాదిపాటు వీళ్ల ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. పెళ్లి చేసుకోవడానికి వినయ్‌ ఒత్తిడి పెంచడంతో ఓ రోజు తనకు పెళ్లయ్యిందని సెల్విరాణి అసలు విషయం చెప్పింది. తన భర్తను తప్పిస్తే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయొచ్చని చెప్పడంతో వినయ్‌ వడివేలుతో స్నేహం చేసి, రెండుసార్లు మద్యం సేవించాడు. అయితే భార్యపై అనుమానం రావడంతో వడివేలు పలుమార్లు ఆమెను కొట్టాడు. విషయం తెలుసుకున్న వినయ్, వడివేలును హతమార్చడానికి నిర్ణయించుకున్నాడు.

సంతపేటకు చెందిన తన స్నేహితుడు నిరంజన్‌కు విషయం చెప్పగా వళ్లియప్పనగర్‌కు చెందిన కిరాయి హంతకుడు ఎం.కిషోర్‌ను సంప్రదించారు. హత్యకు రూ.3 లక్షలు డిమాండ్‌ చేయగా, రూ.2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి వినయ్‌ నుంచి రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న కిషోర్, రెండు నెలలుగా వడివేలును చంపడానికి ప్రయతి్నస్తున్నాడు. ఆటోస్టాండులో గిరాకీలు తెచ్చిస్తూ, వడివేలుకు స్నేహితుడిగా మారిన కిషోర్, ఇతడ్ని చంపడానికి అమెజాన్‌లో కత్తిని కూడా బుక్‌ చేసుకున్నాడు. నాలుగు మార్లు శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి, మద్యం తాగించినప్పటికీ వడివేలు నిబ్బరంగా ఉండటంతో సాధ్యంకాక వచ్చేశాడు.

తన భర్తకు మద్యం తాగిన తరువాత స్వీటు తినిపిస్తే మత్తు ఎక్కు తుందని సెల్విరాణి చెప్పడంతో ఈనెల 5వ తేదీ రాత్రి వడివేలుకు గిరాకీ ఉందని చెప్పిన కిషోర్, మద్యం తాగించి బీరుబాటిల్‌తో తలపైకొట్టి కత్తితో శరీరంలో 23 చోట్ల పొడిచి, ఆపై గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు ఘటనా స్థలానికి వచ్చిన సెల్విరాణి, కుటుంబ సభ్యులతో కలిసి భర్త మృతదేహాన్ని చూసి ఏడుస్తూ నటించింది. అప్పుడు వినయ్‌కు వాట్సాప్‌ కాల్‌ చేసి మాట్లాడి త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. హత్యానంతరం మృతుడి సెల్‌ఫోన్‌ తీసుకుని చెరువులో పడేసిన కిషోర్‌.. వినయ్, నిరంజన్‌తో కలిసి పారిపోయాడు. సాంకేతిక ఆధారాల సాయంతో ఆదివారం ఉదయం నిందితులు ముగ్గురినీ పోలీసులు చిత్తూరు–తిరుపతి బైపాస్‌ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వీళ్ల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు.
చదవండి: శ్రీకాళహస్తి: లాడ్జికి తీసుకెళ్లి.. ఆపై మత్తు మందు ఇచ్చి..    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top