
సాక్షి, ముషీరాబాద్: చిలకలగూడ జలమండలి సబ్ డివిజన్ పరిధిలోని ఎన్‌ఆర్‌కె నగర్‌లోని వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకులో డెడ్‌బాడీపై బుధవారం సస్పెన్స్ వీడింది. ట్యాంక్‌లో పడి కుళ్లిన శవాన్ని కిషోర్‌గా.. అతని సోదరి డెడ్‌బాడీని గుర్తించింది. సంఘటనా స్థలంలో చెప్పుల ఆధారంగా గుర్తించారు. స్థానికంగా కిషోర్ పేయింటింగ్ వర్క్స్ చేస్తూ ఉండేవాడని, మద్యానికి బానిసైనట్లు తెలిపారు. 20 రోజుల క్రీతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు కొద్ది రోజులుగా ఈ ట్యాంకు నుంచి సరఫరా అయిన నీటిని తాగిన రిసాలగడ్డ అంబేడ్కర్‌నగర్, హరినగర్, కృష్ణనగర్, శివస్థాన్‌పూర్, బాకారం ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కృష్ణా పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఈనెల 8, 9వ తేదీలలో నగరంలోని నీటి సరఫరా నిలిపివేస్తుందని జలమండలి ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన వారికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 6గంటల సమయంలో డీఆర్‌ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని బయటకుతీశారు. బయటకు తీసిన మృతదేహం కుళ్లిపోయి ఉంది. వెంటనే ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించిన విషయం తెలిసిందే.