తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్‌ ఎక్కడ?

Warangal Two Years Boy Kidnapped 9 Days Ago No Clue - Sakshi

రెండేళ్ల బాలుడు కనిపించకుండా పోయి తొమ్మిది రోజులు

మట్టెవాడ పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శల వెల్లువ

ఫిర్యాదుదారు కుటుంబసభ్యులను విచారించడంపైనే దృష్టి

నిఘా నేత్రాలకు చిక్కినా పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం

ఆగంతకులు బాబునుఏమి చేశారోనని తల్లిదండ్రుల ఆవేదన

సాక్షి, వరంగల్‌ : ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాజమండ్రిలోని కోరుకుంటకు చెందిన దత్తా ఐశ్వర్య, ఆర్యలకు రెండేళ్ల బాబు డానియెల్‌ ఉన్నాడు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న జెమినీ టాకీస్‌ సమీపంలోనే దోమతెరలు, దువ్వెనలు, అద్దాలు అమ్ముకునే వీరి కుటుంబం.. బుడిబుడి అడుగులు వేస్తున్న కుమారుడిని చూసుకుంటూ కష్టాలను సైతం మరిచి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఈ నెల 11న రెండేళ్ల డానియెల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అపహరించుకుని వెళ్లారు.’

తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఈ కేసులో సాంకేతిక సాక్ష్యాలు అందుబాటులో ఉన్నా.. నిందితులను అరెస్ట్‌ చేయడం వరంగల్‌లోని మట్టెవాడ పోలీసులకు కష్టంగా మారింది. కిడ్నాప్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు నిఘానేత్రాల ద్వారా కిడ్నాప్‌ను గుర్తించి కూడా పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు బతుకమ్మ సంబురాలు...ఇంకోవైపు దసరా వేడుకలు ఉండడంతో బాబు అపహరణ కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  పిల్లలు, మహిళల కేసుల విషయాల్లో సీరియస్‌గా ఉండాల్సిన ఆ ధోరణి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

అసలేం జరిగింది...
సంచార జాతులకు చెందిన ఐశ్వర్య, ఆర్య కుటుంబం వరంగల్‌లోని ఎస్వీఎన్‌ రోడ్డు పక్కనే టెంట్‌ వేసుకొని దోమతెరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటి నుంచో ఐశ్వర్య అమ్మ కుటుంబం ఇక్కడే ఉంటూ వ్యాపారం చేస్తుండడంతో బతుకుదెరువు కోసం నెలరోజుల క్రితం వీరు కూడా ఇక్కడికి వచ్చారు. వీరి రెండేళ్ల బాబు డానియెల్‌పై ఆగంతకుల కన్నుపడింది. ఈ నెల 11న ఉదయం 4.37 గంటల ప్రాంతంలో నల్లటి రంగులో ఉన్న ‘హైదరాబాద్‌ టాప్‌ ఆటో’లో ఒక వ్యక్తి అక్కడ దిగాడు. అదే ఆటోలో ఉన్న మరో వ్యక్తితో కలిసి డ్రైవర్‌ ఎంజీఎం వరకు వెళ్లారు.

ఈ క్రమంలోనే అమ్మ, పెద్దమ్మ గోవింద్‌ దేవీ మధ్యలో నిద్రించి ఉన్న డానియెల్‌ను ఎత్తుకెళ్లేందుకు మూడుసార్లు ప్రయత్నించాడు. ఉదయం 5.03 గంటలకు బాబును చేతిలో ఎత్తుకొని అప్పటికే అక్కడికి చేరుకున్న నంబర్‌ ప్లేట్‌ లేని ఆటోలో బట్టలబజార్‌ బ్రిడ్జి మీదుగా వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్‌ అయ్యింది. ఆ తర్వాత ఆ ఆటో ఎటు వెళ్లిందన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

కొట్టొచ్చిన నిర్లక్ష్యం...
ఈ నెల 11న ఉదయం 5.15 గంటల ప్రాంతంలో లేచిన వీరికి బాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో ఆ తరువాత మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదుచేశారు.  కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు రాజమండ్రిలో ఉన్న బాబు తండ్రి ఆర్యను రప్పించి విచారణ చేశారు. ఫిర్యాదు వచ్చిన తక్షణమే సీసీటీవీ కెమెరా ఫుటేజీలు పరిశీలించాల్సిన మట్వాడ పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా బాబు ఆచూకీ దొరక్కపోవడానికి కారణమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాబు ఆచూకీ కనుగొనేందుకు ఎనిమిది నుంచి పది మంది సభ్యులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయని చెబుతున్నా...తొమ్మిది రోజులు కావస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు నిరుపేదలు కావడంతోనే ఎవరూ అడగరని, అందుకే కేసు ఛేదనపై దృష్టి పెట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీనిపై వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సమాధానమిచ్చారు. 

మమ్ముల్నే విచారిస్తున్నారు..
నా కుమారుడి కిడ్నాప్‌నకు సంబంధించి 12 కెమెరాల్లో చిక్కిన దృశ్యాలను చూపెట్టారు. మొదట ముందునుంచి తీసుకెళ్లినవి చూపెట్టారు. ఆ తర్వాత వెనుక నుంచి బాబును తీసినవే వీడియోలు చూపెడుతున్నారు. ఏమైందని అడిగితే మమ్ముల్నే విచారిస్తున్నారు. దొంగలను పట్టుకోవాల్సింది పోయి పగోళ్లు ఉన్నారా అంటూ మమ్ముల్నే ప్రశ్నిస్తూ ఉన్న సమయం వృథా చేస్తున్నారు. – ఆర్య, కిడ్నాపైన బాబు తండ్రి

పాలు తాగే పిల్లాడు... 
ఠాణా చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అడిగితే వెతుకుతున్నామంటున్నారు. పాలు తాగే పిల్లాడు. కనిపించకుండా పోయి తొమ్మిదిరోజులవుతుంది. ఒక బాబు చాలనుకొని పెద ఆపరేషన్‌ కూడా చేయించుకున్నా. ఉన్న ఒక్కడూ కిడ్నాప్‌ అవడంతో మనసు మనసులో ఉంటలేదు. ఎన్నిసార్లు పోలీసులను వేడుకుంటున్నా స్టేషన్‌ వద్ద ఉండొద్దు బయటకు వెళ్లాలంటూ చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుందనే సమాచారాన్ని కూడా చెప్పడం లేదు. ఎంతో బాధగా ఉంది. మా బాబు క్షేమంగా ఇంటికి రావాలి.  

– దత్త ఐశ్వర్య, బాబు తల్లి  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top