Visakhapatnam Constable Case Updates: Ramesh Last Words About His Wife Shivani, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Vizag Constable Ramesh Case: మై వైఫ్‌.. మై లైఫ్‌.. శివాని గురించి పాపం రమేశ్‌ చివరిమాటలు

Published Sat, Aug 5 2023 6:54 PM

Visakhapatnam Constable Case: Ramesh Last Words About Shivani - Sakshi

సాక్షి, క్రైమ్‌: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్‌ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్‌ తిన్నారు. రమేశ్‌కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది.  

కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్‌ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్‌తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. 

మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్‌ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్‌.. మై లైఫ్‌. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్‌ బెస్ట్‌ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉ‍న్నాయి.  

భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని.  ఆమె ఫోన్‌ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు.

2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ బర్రి రమేష్‌(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది.  రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది.

రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్‌ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు.

నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్‌ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది.

Advertisement
 
Advertisement