నేర సినిమాలు చూసి వరలక్ష్మి హ‌త్య‌కు అఖిల్‌ ప్లాన్‌

Varalakshmi Case: Accused Watched Crime Movies Before Murder - Sakshi

అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతోనే జీవిత‌మ‌నుకున్నాడు. కానీ అత‌డు అనుకుంది జ‌ర‌గ‌లేదు. ఆమె అత‌డిని స్నేహితుడిగా మాత్ర‌మే చూసింది. త‌ట్టుకోలేక‌పోయాడు. క‌క్ష పెంచుకున్నాడు. త‌న‌కు ద‌క్క‌ని ప్రేమ మ‌రొక‌రికి ద‌క్కకూడ‌ద‌ని నిశ్చ‌యించుకున్నాడు. అలా త‌న‌లోని ప్రేమికుడు కాస్తా రాక్ష‌సుడిగా మారాడు. ప్రేమికురాలిని హ‌తురాలిగా మార్చేందుకు క్రైమ్‌ సినిమాలు చూశాడు. నేరం చేసి త‌ప్పించుకోవ‌డమూ నేర్చుకున్నాడు. కానీ అది సినిమా, ఇది నిజ‌ జీవిత‌మ‌ని గుర్తించ‌లేక‌పోయాడు. యువతిని పొట్ట‌న‌పెట్టుకున్నాడే కానీ హత్యా ఘాతుకం నుంచి త‌ప్పించుకోలేక‌పోయాడు.

సాక్షి, విశాఖ‌ప‌ట్నం: రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన వరలక్ష్మి హత్య కేసులో సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెడుతున్నాయి. నిందితుడు అఖిల్ సాయి వెంక‌ట్ త‌న‌కు దూర‌మైన వ‌ర‌ల‌క్ష్మి ఎవ‌రి‌కీ ద‌క్క‌కూడ‌ద‌నే కోపంతో ఈ హ‌త్య‌కు పథకం వేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. హ‌త్య చేయ‌డంతో పాటు, నేరం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు అత‌డు పాపుల‌ర్ క్రిమిన‌ల్ సినిమాలను చూశాడు. ఓ పాపుల‌ర్ సినిమాలో హ‌త్య చేసిన త‌ర్వాత చుట్టూ కారం చ‌ల్లితే డాగ్ స్క్వాడ్ కూడా ప‌సిగ‌ట్ట‌ని సీన్లను చూసినట్టు నిందితుడు వెల్లడించాడు. దీంతో ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం ముందుగానే కారం కొనుగోలు చేసి, అనంత‌రం ఆమెను నిర్మానుష్య ప్ర‌దేశానికి ర‌ప్పించి, బ్లేడుతో కోసి, ఎటువంటి ఆధారాలు లభించ‌కుండా చుట్టూ కారం చ‌ల్లాల‌ని భావించాడు. అలాగే 'దృశ్యం' సినిమాలో చేసిన‌ట్లు పోలీసులను తప్పుదారి పట్టించిన మరొకరిపై నేరాన్ని మోపే ప్రయత్నం కూడా చేశాడ‌ని తేలింది. (చ‌ద‌వండి: వరలక్ష్మి హత్యకేసులో మరింత లోతుగా విచారణ)

మరికొన్ని రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తాము
కాగా గాజువాక శ్రీనగర్‌లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్‌ (21) శనివారం రాత్రి బ్లేడ్‌తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన విష‌యం తెలిసిందే. హత్య జ‌రిగిన‌ ప్రాంతంలో పోలీసులు నేడు (గురువారం) మ‌రోసారి సీన్‌ రీ కన్‌స్ట్ర‌క్షన్ చేశారు. చుట్టుప‌క్క‌ల‌ పరిసరాలలో కొందరి నుంచి సాక్ష్యాలు కూడా సేకరించారు. నిందితుడిపై హత్యానేరంతోపాటు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అభియోగంపై యాక్ట్ జత చేశారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన అనంత‌రం ఏసీపీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ‌ కొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేస్తామ‌ని తెలిపారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. (చ‌ద‌వండి: చదువుల తల్లిని చిదిమేశాడు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top