చదువుల తల్లిని చిదిమేశాడు

Accused Akhil Sai arrested in Varalakshmi Assasinate Case - Sakshi

పథకం ప్రకారమే ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మి హత్య

బ్లేడ్‌తో గొంతు కోసి ప్రాణం తీసిన ప్రేమోన్మాది

నిందితుడు అఖిల్‌సాయి అరెస్ట్‌

సాక్షి, విశాఖపట్నం/గాజువాక: అతడి ప్రేమోన్మాదం చదువుల తల్లిని పొట్టన పెట్టుకుంది. గాజువాక శ్రీనగర్‌లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్‌ (21) శనివారం రాత్రి బ్లేడ్‌తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించాక వరలక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

చదువులో టాపర్‌
వరలక్ష్మి పదో తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 9.8 జీపీఏ సాధించింది. ఆమె గాజువాకలో పాఠశాలలో చదువుతున్నప్పుడు అఖిల్‌సాయి వెంకట్‌ పరిచయమయ్యాడు. అతడు ప్రస్తుతం బీఎల్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. మూడేళ్లుగా వారిద్దరి మధ్య స్నేహం ఉందని చెబుతున్నారు. శనివారం వరలక్ష్మి మేనత్త ఇంట్లో పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. మధ్యాహ్నం బట్టలు మార్చుకుని వస్తానని తల్లిదండ్రులకు చెప్పడంతో వరలక్ష్మిని ఆమె అన్నయ్య ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం యువతి సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

బ్లేడ్‌తో  గొంతు కోసి..
ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న అఖిల్‌సాయి వరలక్ష్మికి ఫోన్‌ చేసి.. ఆమెను చూడాలని ఉందని.. సాయిబాబా ఆలయం వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన వరలక్ష్మితో చాలాసేపు మాట్లాడాడు. ఆ తరువాత వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమెపై దాడి చేసి.. గొంతు, చేతుల్ని కోయడంతోపాటు మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. వరలక్ష్మి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె సోదరుడు, తండ్రి ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావమై వరలక్ష్మి మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. 

పథకం ప్రకారమే హత్య
వరలక్ష్మిని అఖిల్‌సాయి వెంకట్‌ పథకం ప్రకారమే హత్య చేశాడని పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌సిన్హా స్పష్టం చేశారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన వరలక్ష్మి తల్లిదండ్రులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నిందితుణ్ణి అరెస్ట్‌ చేశామని, ఈ కేసును దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశామని చెప్పారు. దిశ ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారని, వారం రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని చెప్పారు. నిందితుడు హత్య తరువాత ఘటనా స్థలంలో వేరే సీన్‌ తయారు చేశాడని, ఈ దాడిని వేరే వ్యక్తిపై నెట్టడానికి ప్రయత్నం చేశాడని చెప్పారు. హత్యకు ముందు ఓ రౌడీషీటర్‌ను కూడా సంప్రదించినట్టు సమాచారం ఉందన్నారు.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పరామర్శ
వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదివారం పరామర్శించారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 

నేడు విశాఖకు హోం మంత్రి
సాక్షి, గుంటూరు: రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. ఈ మేరకు హోం మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని ఆ ప్రకటనలో హోం మంత్రి పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top