
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కారణంగా.. నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళ, ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో మనోహర్ లోధీ, ద్రౌపది భార్యభర్తలు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, మనోహర్ బాల్య స్నేహితుడైన సురేంద్రతో ద్రౌపదికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఒక రోజు.. తన తల్లిని సురేంద్రతో అభ్యంతరకర స్థితిలో చూసిన కూతురు శివాని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. అనంతరం, ద్రౌపదిని ఈ సంబంధం ముగించాలని భర్త సహా కుటుంబం కోరింది. అయితే, తాను మాత్రం సురేంద్ర లేకుండా జీవించలేనని ద్రౌపతి కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. తనపై ఒత్తిడి తీసుకువస్తే, వరకట్న వేధింపులు కేసు పెడతాను అంటూ వారినే బెదిరించింది. దీంతో, ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాకయ్యారు.
ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన భర్త మనోహర్.. తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని స్నేహితుడు సురేంద్రను అభ్యర్థించారు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు, గొడవలు జరిగాయి. ద్రౌపది ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో.. కలత చెందిన కుటుంబ సభ్యులు.. ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మనోహర్ భార్య ద్రౌపదిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.