
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాక లంకా మైదానంలో ఎస్‌వీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం వద్ద నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. సుందర వస్త్ర మహాగణపతి దర్శనానికి విచ్చేసిన భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు విగ్రహం వద్దకు వచ్చి దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు.
ఆంక్షలకు తూట్లు పొడుస్తూ ఉత్సవ నిర్వాహకులు దర్శనానికి వచ్చేవారి నుంచి టికెట్ల పేరుతో వసూళ్లకు పాల్పడటంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. భారీ వినాయకుడి మండపం వద్ద అర్చనలు, అన్న సమారాధన, వాహనాల పార్కింగ్, చెప్పులు భద్రపరచడం వంటి పేర్లతో వ్యాపారానికి తెరలేపడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వినాయక మండపాల వద్ద కమర్షియల్ టికెట్లు ఉండకూడదని పెట్టిన నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని గాజువాక సీఐ పార్థసారథి హెచ్చరించారు.